వరుణ్‌ గౌడ్‌ డబుల్‌ సెంచరీ

19 Dec, 2017 10:33 IST|Sakshi

హైదరాబాద్‌ 527/7 డిక్లేర్డ్‌

 ఓటమి దిశగా ఏ అండ్‌ ఏ

 కూచ్‌ బెహర్‌ క్రికెట్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: కూచ్‌ బెహర్‌ ట్రోఫీ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వరుణ్‌ గౌడ్‌ (263 బంతుల్లో 238; 38 ఫోర్లు) డబుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. వరుణ్‌తో పాటు బౌలింగ్‌లో అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (5/26), సంకేత్‌ (5/59) చెలరేగడంతో హైదరాబాద్‌ గెలుపు ముంగిట నిలిచింది. ఉప్పల్‌ మైదానంలో ఏ అండ్‌ ఏ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్లు ఒకేరోజు 14 వికెట్లు నేలకూల్చడం విశేషం.

ఓవర్‌నైట్‌ స్కోరు 311/5తో రెండోరోజు సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 129 ఓవర్లలో 7 వికెట్లకు 527 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 114 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన వరుణ్‌ 245 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. అలంకృత్‌ (111 బంతుల్లో 51; 6 ఫోర్లు), టి. సంతోష్‌ గౌడ్‌ (59 బంతుల్లో 65; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధసెంచరీలతో రాణించారు. అలంకృత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 157 పరుగుల్ని జోడించిన వరుణ్, సంతోష్‌ గౌడ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ప్రత్యర్థి బౌలర్లలో అల్‌ఫ్రెడ్‌ 2 వికెట్లు పడగొట్టగా, సాబీర్‌ ఖాన్, అభిషేక్‌ ఆనంద్, తహ్‌మీద్‌ తలా వికెట్‌ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఏ అండ్‌ ఏ జట్టు 33.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్‌కు 497 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అభిషేక్‌ ఆనంద్‌ (54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సోను కుమార్‌ గుప్తా (30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత ఫాలోఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఏ అండ్‌ ఏ జట్టు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులతో నిలిచింది. హైదరాబాద్‌ బౌలర్‌ అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (4/10) ధాటికి నలుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌గానే పెవిలియన్‌ చేరారు.

మరిన్ని వార్తలు