ఐసోలేషన్‌ క్రికెట్‌ కప్‌.. ఐసీసీ ట్వీట్‌

16 Apr, 2020 08:53 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వేగంగా వ్యాపి​స్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మహమ్మారి కరోనా దెబ్బకు టోక్యో ఒలింపిక్స్‌, టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్స్‌, ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలు, సిరీస్‌లు వాయిదా పడటమో లేక రద్దవ్వడమో జరిగాయి. దీంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో కొందరు ఆటగాళ్లు తమ వ్యాపకాలు, వంటలకు సంబంధించిన పలు వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే మరికొంత మంది తమ మెదడుకు మేత వేస్తూ సృజనాత్మకంగా ఆలోచించి వీడియోలను రూపొందిస్తున్నారు. టీమిండియా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి అండ్‌ టీం తమ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ‘ఐసోలేషన్‌ క్రికెట్‌ కప్‌’ పేరిట వినూత్న వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

‘లాక్‌డౌన్‌ సమయంలో మేము క్రికెట్‌ను ఎక్కువగా మిస్సవుతున్నాం. అందుకే మాకు మేమే సొంతంగా మా ఇంట్లోనే ఓ లీగ్‌ను ప్రారంభించాం. అదే ఐసోలేషన్‌ క్రికెట్‌ కప్‌(ఐసీసీ)’ అంటూ వేద కృష్ణమూర్తి ట్వీట్‌ చేశారు. బ్యాటర్‌, బౌలర్‌, అంపైర్‌, కామెంటేటర్‌, కీపర్‌, ఫీల్డర్‌, ఆడియన్స్ ఇలా అందరూ ఉన్న ఈ లీగ్‌కు సంబంధించిన వీడియోను సైతం పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) కూడా వేద ప్రారంభించిన క్రికెట్‌ లీగ్‌కు ఫిదా అయింది. అంతేకాకుండా త్వరలోనే ఐసోలేషన్‌ క్రికెట్‌ కప్‌ తారాస్థాయికి చేరుకుంటుందని సరదాగా వ్యాఖ్యానించింది. ఇక వేద అండ్‌ టీంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఆలోచన బాగుందని, లైవ్‌ కామెంటరీ రియలిస్టిక్‌గా ఉందని, ఆడియన్స్‌ చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.   

చదవండి:
టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి
ప్రియాంక, కరీనా ఇష్టం.. స్టెయిన్‌ కష్టం

మరిన్ని వార్తలు