ఐపీఎల్‌ మ్యాచ్‌లో పాములు వదులుతాం

10 Apr, 2018 16:50 IST|Sakshi
చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ సభ్యులు

సాక్షి, చైన్నై: ఐపీఎల్‌-11 సీజన్‌కు కావేరీ జలాల వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టబోతోంది. చెపాక్‌ స్టేడియంలో ఈరోజు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది. కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పలు రాజకీయ, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఒక వేళ మ్యాచ్‌లను నిర్వహిస్తే తమ నిరసన తెలియజేస్తామని కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దాదాపు 4 వేల మంది పోలీసులతో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా పీఎంకే నేత వేల్‌మురుగన్‌ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమ మాట కాదని మ్యాచ్‌ నిర్వహించాలని చూస్తే స్టేడియంలోకి పాములను వదులుతామని ఆయన హెచ్చరించడం సంచలంగా మారింది. 

ఇప్పటికే ఆందోళనకారులు నల్లటి వస్త్రాలతో మ్యాచ్‌లకు హాజరై తమ నిరసన తెలియజేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే మ్యాచ్‌ నిర్వాహకులు మాత్రం నల్లటి వస్త్రాలు, రిస్ట్‌ బ్యాండ్స్‌, బ్యాడ్జెస్‌లతో వచ్చే అభిమానులను స్టేడియంలోకి అనుమతించబోమని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అభిమానులు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, హెల్మెట్స్‌, కెమెరాలు, గొడుగులు, బయటి ఫుడ్‌, మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏవస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు మీడియాకు తెలిపారు.

భద్రతకు భరోసా: శుక్లా
ఈరోజు జరిగే మ్యాచ్‌కు భద్రత కల్పిస్తామని తమిళనాడు ప్రభుత్వం, చెన్నై పోలీసులు హామీయిచ్చారని ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని కలిశానని ఆయన వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులకు ఆటగాళ్లకు గట్టి భద్రత కల్పిస్తామని వారు భరోసాయిచ్చినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు