వీనస్‌ వెలుగులు

7 Sep, 2017 00:36 IST|Sakshi
వీనస్‌ వెలుగులు

∙ ఆరేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌కు అర్హత
∙ క్వార్టర్స్‌లో క్విటోవాపై విజయం
∙ యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ


న్యూయార్క్‌: తొమ్మిదేళ్లుగా ఊరిస్తోన్న మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకునేందుకు అమెరికా టెన్నిస్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ రెండు విజయాల దూరంలో నిలిచింది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తొమ్మిదో సీడ్‌ వీనస్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌కు చేరింది. ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల వీనస్‌ క్వార్టర్‌ ఫైనల్లో 6–3, 3–6, 7–6 (7/2)తో 13వ సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచింది. 2 గంటల 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్‌ ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఇద్దరూ తమ సర్వీస్‌లను మూడుసార్లు కోల్పోయినా... కీలకమైన టైబ్రేక్‌లో వీనస్‌ పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది.

ఈ విజయంతో వీనస్‌ 2011 తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌–5లో చోటు సంపాదించనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్‌ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచిన వీనస్‌ తాజా ప్రదర్శనతో యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీస్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 2001, 2002లలో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన వీనస్‌ సెమీఫైనల్లో అమెరికాకే చెందిన అన్‌సీడెడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌తో ఆడనుంది. క్వార్టర్‌ ఫైనల్లో స్లోన్‌ స్టీఫెన్స్‌ 6–3, 3–6, 7–6 (7/4)తో 16వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది.  

పాబ్లో, అండర్సన్‌ జోరు...: పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 12వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌), 28వ సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో పాబ్లో బుస్టా 6–4, 6–4, 6–2తో 29వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై, అండర్సన్‌ 7–6 (7/5), 6–7 (9/11), 6–3, 7–6 (9/7)తో 17వ సీడ్‌ సామ్‌ క్వెరీ (అమెరికా)పై గెలిచారు. ఈ విజయాలతో పాబ్లో, అండర్సన్‌లు తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సింగిల్స్‌ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్‌ చేరే క్రమంలో పాబ్లో ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం.

ప్లిస్కోవాకు షాక్‌... కొత్త నం.1 ముగురుజా
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో క్వార్టర్‌ ఫైనల్లో 20వ సీడ్‌ కోకో వాండెవాగె (అమెరికా) 7–6 (7/4), 6–3తో ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించి తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గత ఏడాది రన్నరప్‌ ప్లిస్కోవా క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి కారణంగా... వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌) కొత్త నంబర్‌వన్‌గా అవతరించనుంది.  

మరిన్ని వార్తలు