మా వాడు ‘ట్రిపుల్‌’ చేశాక స్వర్గంలో ఉన్నట్టుంది

19 Dec, 2016 18:47 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో అజేయ ట్రిపుల్‌ సెంచరీ చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ను అతని తల్లిదండ్రులు అభినందించారు. తమ కొడుకు ఈ ఘనత సాధించడం తమకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడని, ఇప్పుడు దాన్ని సాధించాడని కరుణ్‌ నాయర్‌ తండ్రి కళాధరన్‌ నాయర్‌ అన్నారు. తనకు స్వర్గంలో ఉన్నంత అనుభూతి కలుగుతోందని కరుణ్‌ తల్లి అన్నారు. కరుణ్‌ నాయర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. నాయర్‌ను అభినందించారు. అతను ఇలాగే మరిన్ని రికార్డులు సాధించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్రికెటర్లు.. నాయర్‌కు అభినందనలు తెలిపారు.

టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మన్‌గా నాయర్‌ రికార్డు నెలకొల్పాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల నాయర్ (303 నాటౌట్;381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) ఈ ఫీట్‌ నమోదు చేశాడు. తానాడిన మూడో టెస్టు మ్యాచ్‌లోనే ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. అతనికి అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. గత 12 ఏళ్లుగా తాను ఒక్కడినే 300 పరుగుల క్లబ్‌లో ఉన్నానని, ఇన్నాళ్లకు నాయర్‌ను ఆహ్వానిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. 2004లో ముల్తాన్‌ టెస్టులో పాకిస్థాన్‌పై సెహ్వాగ్‌ తొలిసారి ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్‌గా చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్‌ మరోసారి ట్రిపుల్‌ సెంచరీ బాదాడు.