వారిద్దరికి బౌలింగ్‌ చాలా కష్టం: కుల్దీప్‌

4 Jul, 2020 03:14 IST|Sakshi

న్యూఢిల్లీ: తన కెరీర్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్, సఫారీ విధ్వంసక క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌లకు బౌలింగ్‌ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డానని భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అన్నాడు. వీరికి ఎలా బంతులేసినా ఆపలేకపోయానని కుల్దీప్‌ చెప్పాడు. ‘స్మిత్‌ చాలా వరకు బ్యాక్‌ఫుట్‌పై, అదీ బాగా ఆలస్యంగా ఆడతాడు. కాబట్టి అతనికి బౌలింగ్‌ చేయడం పెద్ద సవాల్‌. ఏబీ అద్భుతమైన ఆటగాడు. అతని శైలి ఎంతో ప్రత్యేకం. నా బౌలింగ్‌ను చితక్కొడతాడని నేను భయపడిన బ్యాట్స్‌మన్‌ అతనొక్కడే. ఇప్పుడిక రిటైర్‌ అయిపోయాడు కాబట్టి సమస్య లేదేమో’ అని కుల్దీప్‌ తన మనసులో మాట చెప్పాడు. గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చని కుల్దీప్‌... సహచర లెగ్‌స్పిన్నర్‌ చహల్‌తో తనకు పోటీ లేదన్నాడు. చాలా కాలంగా మాజీ కెప్టెన్‌ ధోని ఆటకు దూరం కావడం వల్ల మైదానంలో అతను ఇచ్చే విలువైన సూచనలు కోల్పోతున్నానని కుల్దీప్‌ వెల్లడించాడు. ధోని వికెట్ల వెనక ఉంటే ఫీల్డింగ్‌ గురించి, పిచ్‌ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదని, బౌలర్లలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఈ మణికట్టు స్పిన్నర్‌ వ్యాఖ్యానించాడు.

‘కోడ్‌’ పాటిస్తేనే గుర్తింపు ఇవ్వండి: ఢిల్లీ హైకోర్డు ఆదేశం
స్పోర్ట్స్‌ కోడ్‌ను పాటించే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని, గ్రాంట్‌లను మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టు... కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఏడాదికి గానూ ప్రభుత్వం గుర్తించిన 57 ఎన్‌ఎస్‌ఎఫ్‌లలో కోడ్‌ పాటించే సంఘాలు, సమాఖ్యల వివరాలు తమకు మూడు వారాల్లోపు వెల్లడించాలని జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ నజ్మీ వాజిరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ‘స్పోర్ట్స్‌ కోడ్‌ను విస్మరించే క్రీడా సమాఖ్యలకు ఇచ్చే గుర్తింపును కోర్టు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు’ అని ధర్మాసనం వెలువరిం చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.

మరిన్ని వార్తలు