చందర్‌పాల్‌కు మొండి చెయ్యి

1 Jun, 2015 03:21 IST|Sakshi
చందర్‌పాల్‌కు మొండి చెయ్యి

 రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో బ్రియాన్ లారా (11,953 పరుగులు) తర్వాత చందర్‌పాల్ రెండో స్థానంలో ఉన్నాడు.

మరో 87 పరుగులు చేస్తే చందర్‌పాల్ టాప్ స్కోరర్ ఘనతను సాధిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చందర్‌పాల్ సగటు 15.33 మాత్రమే ఉండటంతో సెలక్టర్లు అతని ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఆసీస్‌తో ఒక్క సిరీస్‌కు అవకాశం ఇస్తే బాగుండేదని చందర్‌పాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. 1994లో జాతీయ జట్టులోకి వచ్చిన చందర్‌పాల్ ఇప్పటివరకు 164 టెస్టులు ఆడి 51.37 సగటుతో 11,867 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సెలక్టర్ల తాజా నిర్ణయంతో చందర్‌పాల్ టెస్టు కెరీర్ ముగిసినట్టేనని భావించాలి.

మరిన్ని వార్తలు