శ్రీలంక రెండోసారి...

31 Jul, 2016 01:50 IST|Sakshi
శ్రీలంక రెండోసారి...

17 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై విజయం
106 పరుగులతో కంగారూలు చిత్తు


పల్లెకెలె: స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన శ్రీలంక జట్టు తమ టెస్టు చరిత్రలో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో లంక 106 పరుగుల తేడాతో ప్రపంచ నంబర్‌వన్ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 83/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (125 బంతుల్లో 55; 1 ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (5/54) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, తొలి టెస్టు ఆడుతున్న లక్షణ్ సందకన్ (3/49) అండగా నిలిచాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన కుషాల్ మెండిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం నుంచి గాలేలో జరుగుతుంది.

 178 బంతుల్లో 4 పరుగులు!
చేతిలో 7 వికెట్లతో విజయానికి మరో 185 పరుగులు కావాల్సిన దశలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వోజెస్ (12) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్మిత్, మార్ష్ (29) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 18 పరుగుల తేడాతో కంగారూలు మరో 4 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయ్యారు. ఈ దశలో పీటర్ నెవిల్ (115 బంతుల్లో 9), స్టీవ్ ఓ కీఫ్ (98 బంతుల్లో 4) మొండిగా పోరాడారు. పరుగులు చేయకున్నా క్రీజ్‌లో పాతుకుపోయారు. వర్ష సూచనతో పాటు వెలుతురు తగ్గడంతో లంక శిబిరంలో ఆందోళన మొదలైంది.

చివరకు ధనంజయ ఈ జోడీని విడదీయడంతో లంక విజయం దిశగా వెళ్లింది. నెవిల్, కీఫ్ తొమ్మిదో వికెట్‌కు 178 బంతులు ఎదుర్కొని కేవలం 0.13 రన్‌రేట్‌తో 4 పరుగులు మాత్రమే జోడించడం విశేషం! టెస్టుల్లో ఇంత తక్కువ రన్‌రేట్‌తో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత ఏడాది భారత్‌పై ఆమ్లా, డివిలియర్స్ 253 బంతులు ఆడి 27 పరుగులు (0.64 రన్‌రేట్) చేశారు. టెస్టు చరిత్రలో ఆస్ట్రేలియాపై శ్రీలంకకు ఇది రెండో విజయం మాత్రమే కావడం విశేషం. చివరి సారిగా ఆ జట్టు ఆసీస్‌ను 1999లో ఓడించింది. మొత్తంగా కంగారూలపై ఆడిన 27 టెస్టుల్లో లంక 17 ఓడింది.

మరిన్ని వార్తలు