విదర్భ 200/7

4 Feb, 2019 02:33 IST|Sakshi

సౌరాష్ట్రతో రంజీ ఫైనల్‌

నాగ్‌పూర్‌: సౌరాష్ట్ర బౌలర్లు తొలిరోజు ఆటను శాసించారు. రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో నిలువకుండా దెబ్బమీద దెబ్బ కొట్టారు. సౌరాష్ట్ర కెప్టెన్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ (2/26) విదర్భ టాప్‌ లేపాడు. కీలకమైన విదర్భ ‘రన్‌ మెషీన్‌’ వసీమ్‌ జాఫర్‌ (23; 1 ఫోర్, 1 సిక్స్‌)తో పాటు ఓపెనర్‌ సంజయ్‌ (2)ను ఔట్‌ చేశాడు. మిగతా బౌలర్లు తలా ఒక చేయి వేశారు. దీంతో ఆదివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

మొదట టాస్‌ నెగ్గిన విదర్భ బ్యాటింగ్‌ ఎంచుకుంది. సంజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌ (16) శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఫజల్‌ రనౌట్‌ కాగా, ఉనాద్కట్‌ బౌలింగ్‌లో సంజయ్, జాఫర్‌ నిష్క్రమించడంతో విదర్భ 60 పరుగులకే 3 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన వారిలో మోహిత్‌ కాలే (35; 4 ఫోర్లు), గణేశ్‌ సతీశ్‌ (32; 1 ఫోర్, 1 సిక్స్‌) కాసేపు నిలబడటంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది.

తర్వాత సౌరాష్ట్ర బౌలర్లు మూకుమ్మడిగా పట్టుబిగించడంతో విదర్భ ఇన్నింగ్స్‌ కకావికలమైంది. జట్టు స్కోరు 106 పరుగుల వద్ద మోహిత్‌ కాలేను స్పిన్నర్‌ కమలేశ్‌ మక్వానా, సతీశ్‌ను మీడియం పేసర్‌ ప్రేరక్‌ మన్కడ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చారు. ఇది చాలదన్నట్లు క్రీజులో పాతుకుపోతున్న అక్షయ్‌ వాడ్కర్‌ (45)ను చేతన్‌ సాకరియా సాగనంపాడు. దీంతో 33 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి అక్షయ్‌ కర్నేవర్‌ (31 బ్యాటింగ్‌), అక్షయ్‌ వఖరే (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు