విదర్భ అద్భుతం

2 Jan, 2018 00:36 IST|Sakshi

తొలిసారి రంజీట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు

ఫైనల్లో ఢిల్లీపై 9 వికెట్లతో గెలుపు 

ఇండోర్‌: ప్రత్యర్థి ఢిల్లీపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటిన విదర్భ తొలిసారి రంజీట్రోఫీ విజేతగా నిలిచింది. ఇక్కడి హోల్కర్‌ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఫైనల్‌ను నాలుగో రోజే ముగించి... ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. తమ జట్టు చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైన 252 పరుగుల ఆధిక్యం సాధించిన విదర్భ... ఢిల్లీని రెండో ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 29 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది.  

నాలుగో రోజు... 14 వికెట్లు 
సోమవారం ఆటలో ఏకంగా 14 వికెట్లు పతనమయ్యాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 528/7తో బరిలో దిగిన విదర్భ మరో 19 పరుగులు మాత్రమే జోడించి 547కు ఆలౌటైంది. శతక వీరుడు అక్షయ్‌ వాడ్కర్‌ (133) ముందు రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు. సిద్దేశ్‌ నెరల్‌ (79), ఆదిత్య థాకరే (0)లను నవదీప్‌ సైనీ (5/135) అవుట్‌ చేశాడు. అనంతరం భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయింది. ఓపెనర్‌ చండేలా (9) త్వరగానే నిష్క్రమించగా ఊపుమీద కనిపించిన గౌతమ్‌ గంభీర్‌ (36) అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ఈ దశలో ధ్రువ్‌ షోరే (62), నితీశ్‌ రాణా (64) మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యాక ఢిల్లీ కోలుకోలేకపోయింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (32), వికాస్‌ మిశ్రా (34) సహా మరో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. వాఖరే (4/95); ఆదిత్య సర్వతే (3/30); గుర్బానీ (2/92) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. స్వల్ప లక్ష్యాన్ని అందుకునే క్రమంలో విదర్భ కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (2) త్వరగానే అవుటైనా... సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ (17 నాటౌట్‌) ఒకే ఓవర్లో నాలుగు బౌండరీలు బాది తమ జట్టుకు మరుపురాని విజయాన్నందించాడు. హ్యాట్రిక్‌ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

►18 రంజీ ట్రోఫీ టైటిల్‌ను  గెలుచుకున్న 18వ జట్టు విదర్భ

►61 తొలి రంజీ మ్యాచ్‌ (1957–58) ఆడిననాటినుంచి విజేతగా నిలిచేందుకు విదర్భకు 61 సీజన్లు పట్టింది  

►9 తొమ్మిదిసార్లు రంజీ నెగ్గిన జట్టులో సభ్యుడు వసీం జాఫర్‌. 8 సార్లు ముంబై తరఫున , ఈ సారి విదర్భ తరఫున గెలిచాడు  

►ప్రైజ్‌మనీ కింద విదర్భకు రూ.2 కోట్లు దక్కగా, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ మరో రూ.3 కోట్లను ప్రోత్సాహకంగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు