విదర్భ మళ్లీ మెరిసింది..

16 Feb, 2019 15:57 IST|Sakshi

నాగ్‌పూర్‌: గతేడాది ఇరానీకప్‌లో విజేతగా నిలిచిన విదర్భ..ఈ ఏడాది కూడా మెరిసింది. రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విదర్భ వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడంతో మరోమారు రెస్టాఫ్‌ ఇండియాతో ఇరానీకప్‌లో విదర్భకు తలపడే అవకాశం దక‍్కింది. ఈ పోరులో  ఆద్యంతం ఆకట్టుకున్న విదర్భ టైటిల్‌ను దక్కించుకుంది. రెస్టాఫ్‌ ఇండియా నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విదర్భ ఆట నిలిచే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఆధారంగా విదర్భను విజేతగా ప్రకటించారు.

విదర్భ తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా, రెస్టాఫ్‌ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. ఇక రెస్టాఫ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఆపై ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆదిలోనే కెప్టెన్‌ ఫైజ్‌ ఫజాల్‌ వికెట్‌ను కోల్పోయింది. ఫజాల్‌ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో విదర్భ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో సంజయ్‌ రఘనాథ్‌(42), అథర్వా తైడే(72)లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై గణేశ్‌ సతీష్‌(87) హాఫ్‌ సెంచరీతో ఆకట్టకోగా, మోహిత్ కాలే(37) ఫర్వాలేదనిపించాడు. విదర్భ ఐదో వికెట్‌గా గణేశ్‌ సతీష్‌ వికెట్‌ను కోల్పోయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు సంధి చేసుకున్నారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో నిలిచిన విదర్భను విజేతగా ప్రకటించారు. 2018 ఇరానీకప్‌లో కూడా తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగానే విదర్భ టైటిల్‌ను గెలవడం విశేషం.

మరిన్ని వార్తలు