2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమ్స్‌

20 Apr, 2017 01:53 IST|Sakshi
2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమ్స్‌

కువైట్‌ సిటీ: వీడియో గేమ్స్‌ ఇక చిన్న పిల్లల ఆట మాత్రమే కాదు... దేశానికి పతకం సాధించి పెట్టే క్రీడగా మారనుంది. 2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) బుధవారం ప్రకటించింది. చైనాలోని హాంగ్జులో 2022లో జరిగే ఆసియా క్రీడల్లో ఈ–స్పోర్ట్స్‌ (వీడియో గేమింగ్‌)ను  అధికారికంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి సన్నాహకంగా వచ్చే ఏడాది ఇండోనేసియాలో జరగనున్న ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు.

ఈమేరకు చైనాలోని ప్రముఖ ఈ–స్పోర్ట్స్‌ కంపెనీ అలీబాబా గ్రూప్‌కు చెందిన అలీస్పోర్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ 11 ఏళ్ల పాటు ఈ–స్పోర్ట్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. కాగా ఆసియా క్రీడల్లో ఏ తరహా వీడియో గేమ్స్‌ను అనుమతిస్తున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘ఇన్నాళ్లూ సంప్రదాయ క్రీడలను అభివృద్ధి చేసిన ఓసీఏ రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త తరహా క్రీడలను అందుబాటులోకి తెస్తుందని’ ఓసీఏ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ ఫహాద్‌ అల్‌ సబా అన్నారు.    

మరిన్ని వార్తలు