బెంబేలెత్తించిన బుమ్రా

1 Sep, 2019 04:40 IST|Sakshi

హనుమ విహారి తొలి సెంచరీ

అర్ధసెంచరీ సాధించిన ఇషాంత్‌ శర్మ

భారత్‌ 416 ఆలౌట్‌    

హ్యాట్రిక్‌తో రెచ్చిపోయిన బుమ్రా

టెస్టుల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు

విండీస్‌ 87/7

రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకపోతోంది. తొలి టెస్టులో విజయఢంకా మోగించిన కోహ్లి సేన.. రెండో టెస్టుపై పట్టు బిగించింది. దీంతో ఆతిథ్య వెస్టిండీస్‌కు వైట్‌వాష్‌ తప్పేలాలేదు. ముందుగా బ్యాట్స్‌మెన్‌ తమ విధులను సక్రమంగా నిర్వర్తించగా.. అనంతరం భారత బౌలర్లు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పని పట్టారు. దీంతో ఆతిథ్య జట్టు ఫాలోఆన్‌ గండం ఎదుర్కొనే అవకాశం ఉంది. అద్భుతాలు జరిగితే తప్పా.. మూడో రోజే మ్యాచ్‌ ముగిసిపోయే అవకాశం ఉంది.  

కెరీర్‌ (ఓవల్‌) తొలి టెస్టులో కీలక అర్ధ సెంచరీ, మెల్‌బోర్న్‌లో ఓపెనర్‌గా ఆకట్టుకునే ప్రదర్శన, సిడ్నీలో సొగసైన ఆట... టెస్టు బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను ఐదు టెస్టుల్లోనే చూపించిన తెలుగు తేజం, ఆంధ్ర క్రికెటర్‌ గాదె హనుమ విహారి ఇప్పుడు ఆరో టెస్టులో తొలి సెంచరీతో సత్తా చాటాడు. ఆంటిగ్వాలో చేజారిన శతకాన్ని జమైకాలో అందుకొని గర్వంగా నిలిచాడు. మరోవైపు కెరీర్‌ 92వ టెస్టులో పేసర్‌ ఇషాంత్‌ శర్మ తొలి అర్ధ సెంచరీ సాధించడంతో రెండో టెస్టులో భారత్‌కు పట్టు చిక్కింది. 

విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు భారత స్టార్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా నిద్రలేకుండా చేస్తున్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన బుమ్రా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయాడు. సూపర్‌ బౌలింగ్‌ పర్ఫామెన్స్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. హ్యాట్రిక్‌ సాధించి విండీస్‌ నడ్డివిడిచాడు. దీంతో టెస్టుల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో భారత బౌలర్‌గా.. విండీస్‌పై ఈ ఘనత అందుకున్న తొలి టీమిండియా బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. 

కింగ్‌స్టన్‌ (జమైకా) : తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్‌ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ పనిపట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్‌ ఉండటం విశేషం. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్‌ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హామిల్టన్‌(2 బ్యాటింగ్‌), కార్న్‌వాల్‌(4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. షమీ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. 

విండీస్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ బ్రాత్‌వైట్(4), క్యాంప్‌బెల్‌2), డారెన్‌ బ్రేవో(4), బ్రూక్స్‌(0), రోస్టన్‌ ఛేజ్‌(0), హోల్డర్‌(18)లు బుమ్రా బౌలింగ్‌ ధాటికి బలయ్యారు. ఓ క్రమంలో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్‌ను హెట్‌మెయిర్‌(34) ఆదుకున్నాడు. అయితే ఈ ఆటగాడిని షమీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. ఓ సూపర్‌ బంతికి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇప్పటికే టీమిండియా 329 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఉంది. అంతకుముందు హనుమ విహారి (225 బంతుల్లో 111; 16 ఫోర్లు) శతకానికి తోడు ఇషాంత్‌ శర్మ (80 బంతుల్లో 57; 7 ఫోర్లు) కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారి, ఇషాంత్‌ ఎనిమిదో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. 

మొదటి బంతికే... 
భారత్‌ రెండో రోజు ఆట పేలవంగా ప్రారంభమైంది. హోల్డర్‌ వేసిన తొలి బంతికే రిషభ్‌ పంత్‌ (27) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (69 బంతుల్లో 16) పట్టుదలగా క్రీజ్‌లో నిలబడేందుకు ప్రయత్నించాడు. అయితే కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ దశలో ఇషాంత్‌ విహారికి అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లంచ్‌ తర్వాత విహారిని వెనక్కి నెట్టి ఇషాంత్‌ దూసుకుపోయాడు. హోల్డర్, ఛేజ్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అధిగమించాడు. అనంతరం 69 బంతుల్లో అర్ధసెంచరీ సాధించడంతో భారత డ్రెస్సింగ్‌రూమ్‌ హోరెత్తింది.  

వహ్వా విహారి... 
గత టెస్టులో త్రుటిలో శతకం చేజార్చుకున్న విహారి ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయిని దాటాడు. తొలి రోజు ‘సున్నా’ వద్ద రోచ్‌ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్‌ నుంచి తప్పించుకున్న అతను చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. గాబ్రియెల్, రోచ్‌ ఓవర్లలో విహారి కొట్టిన రెండేసి ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. 42 పరుగుల వద్ద అతని మొదటి రోజు ఆట ముగిసింది. శనివారం ఆటలో అతను కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించాడు. కొంత అదృష్టం కూడా ఆంధ్ర ఆటగాడికి కలిసొచ్చింది.  హోల్డర్‌ వేసిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని వికెట్ల మీదుగా వెళ్లడంతో బతికిపోయిన అతను ఈ నాలుగు పరుగులతో 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

68 పరుగుల వద్ద కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాంప్‌బెల్‌ క్యాచ్‌ వదిలేశాడు. ఈ ఓవర్లో విహారి మూడు ఫోర్లు కొట్టడం విశేషం. కొద్ది సేపటికే 79 పరుగుల వద్ద హోల్డర్‌ బౌలింగ్‌లోనే అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో ఫలితం అనుకూలంగా వచ్చింది. లంచ్‌ సమయానికి 158 బంతుల్లో 84 పరుగుల వద్ద నిలిచిన విహారి శతకానికి ముందు మళ్లీ కొంత ఒత్తిడికి గురయ్యాడు. అయితే చివరకు రోచ్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా సింగిల్‌ తీయడంతో 200 బంతుల్లో విహారి తొలి సెంచరీ పూర్తయింది. గాల్లోకి పంచ్‌ విసిరి అతను తన భావోద్వేగాలను ప్రదర్శించాడు. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 87/7

>
మరిన్ని వార్తలు