హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

8 Oct, 2019 08:50 IST|Sakshi

బౌలింగ్‌లో చెరో నాలుగు వికెట్లతో మెరిసిన సిరాజ్, సందీప్‌

బ్యాటింగ్‌లో రాణించిన తన్మయ్, మల్లికార్జున్‌

గోవాపై ఐదు వికెట్లతో రాయుడు బృందం విజయం

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో మొహమ్మద్‌ సిరాజ్, సందీప్‌ అదరగొట్టగా... అనంతరం బ్యాటింగ్‌లో తన్మయ్‌ అగర్వాల్‌ అర్ధ శతకంతో కదం తొక్కడంతో హైదరాబాద్‌ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగళూరు వేదికగా గోవాతో సోమవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గోవాను సిరాజ్‌ (4/20), బావనక సందీప్‌ (4/13) బెంబేలెత్తించారు.

సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతుల్లో సగుణ్‌ కామత్‌ (0), స్నేహల్‌ (0)లను ఔట్‌ చేసి ప్రత్యర్థి పతనానికి బాటలు వేశాడు. కాసేపటి తర్వాత హైదరాబాద్‌ బౌలర్లు మరో రెండు వికెట్లు తీయడంతో గోవా 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్‌ సునీల్‌ దేశాయ్‌ (87 బంతుల్లో 55; 4 ఫోర్లు, సిక్స్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతను అమిత్‌ వర్మ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.

దీంతో గోవా 100 పరుగుల మార్కును దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రోహిత్‌ రాయుడు విడదీశాడు. రోహిత్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయిన అమిత్‌ వర్మ మిలింద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఇక్కడి నుంచి సందీప్‌ మాయాజాలం ప్రారంభమైంది. అర్ధ శతకంతో కుదురుకున్న సునీల్‌ దేశాయ్‌తో పాటు మరో ముగ్గురిని ఔట్‌ చేయడంతో... గోవా 37.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది.  

స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా... ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (71 బంతుల్లో 66 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్స్‌) అండతో హైదరాబాద్‌ 22.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. రెండో ఓవర్‌ మూడో బంతికి పరుగు కోసం ప్రయత్నించిన ఓపెనర్‌ అక్షత్‌ రెడ్డి (0) రనౌట్‌ కాగా... రోహిత్‌ రాయుడు (1) కాసేపటికే పెవిలియన్‌ చేరడంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో తన్మయ్‌ అగర్వాల్‌ , సారథి అంబటి రాయుడు (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌) జట్టును ఆదుకున్నారు. వీరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 44 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. రాయుడు ఔటైనా... మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న తన్మయ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతను మల్లికార్జున్‌ (28 బంతుల్లో 30; 4 పోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అయితే చివర్లో గోవా బౌలర్లు వెంట వెంటనే రెండు వికెట్లు తీసినా... తన్మయ్‌ లాంఛనం పూర్తి చేశాడు. 

స్కోర్‌ వివరాలు 
గోవా ఇన్నింగ్స్‌: సగున్‌ కామత్‌ (సి) తన్మయ్‌ (బి) సిరాజ్‌ 0; సునీల్‌ దేశాయ్‌ (సి) మల్లికార్జున్‌ (బి) సందీప్‌ 55; స్నేహల్‌ (సి) మల్లికార్జున్‌ (బి) సిరాజ్‌ 0; కౌశిక్‌ (సి) తన్మయ్‌ (బి) సిరాజ్‌ 11; ప్రభు దేశాయ్‌ (సి) మల్లికార్జున్‌ (బి) మిలింద్‌ 8; అమిత్‌ వర్మ (సి) మిలింద్‌ (బి) రోహిత్‌ రాయుడు 29; గౌతం (ఎల్బీ) (బి) సందీప్‌ 0; మిసాల్‌ (సి) మల్లికార్జున్‌ (బి) సిరాజ్‌ 8; గార్గ్‌ (బి) సందీప్‌ 0; శుభం దేశాయ్‌ (నాటౌట్‌) 4; పరబ్‌ (సి) హిమాలయ్‌ అగర్వాల్‌ (బి) సందీప్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (37.4 ఓవర్లలో ఆలౌట్‌) 122. 
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–17, 4–42, 5–110, 6–110, 7–117, 8–117, 9–121, 10–122. 
బౌలింగ్‌: సిరాజ్‌ 9–2–20–4, మిలింద్‌ 6–1–18–1, మెహదీ హసన్‌ 5–0–14–0, సాకేత్‌ సాయిరామ్‌ 5–0–33–0, సందీప్‌ 7.4–2–13–4, రోహిత్‌ రాయుడు 5–0–23–1. 
హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (నాటౌట్‌) 66; అక్షత్‌ (రనౌట్‌) 0; రోహిత్‌ రాయుడు (సి) మిసాల్‌ (బి) పరబ్‌ 1; అంబటి రాయుడు (సి) అమిత్‌ వర్మ (బి) మిసాల్‌ 21; మల్లికార్జున్‌ (సి) గౌతం (బి) గార్గ్‌ 30; సందీప్‌ (బి) శుభం దేశాయ్‌ 2; హిమాలయ్‌ అగర్వాల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (22.2 ఓవర్లలో 5 వికెట్లకు) 126. 
వికెట్ల పతనం: 1–4, 2–15, 3–59, 4–114, 5–117. 
బౌలింగ్‌: గార్గ్‌ 6–0–38–1, పరబ్‌ 6–1–21–1, మిసాల్‌ 6–0–36–1, శుభం దేశాయ్‌ 3.2–0–25–1, అమిత్‌ వర్మ 1–0–5–0. 

మరిన్ని వార్తలు