తమిళనాడుతో కర్ణాటక ‘ఢీ’

23 Oct, 2019 18:27 IST|Sakshi

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో కర్ణాటక తుదిసమరానికి సిద్దమైంది. బుధవారం జరిగిన రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో తమిళనాడు, కర్ణాటక జట్లు విజయాలు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఛత్తీస్‌గడ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో కర్ణాటక 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఛత్తీస్‌గడ్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (92; 98 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(88 నాటౌట్‌; 111 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌)లు ఆద్వితీయ ఇన్నింగ్స్‌ నిర్మించగా.. మయాంక్‌ అగర్వాల్‌(47 నాటౌట్‌, 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపులు మెరిపించడంతో కర్ణాటక సులువుగా విజయం సాధించింది. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌గడ్‌ కర్ణాటక బౌలర్ల ధాటికి 49.4 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. అమన్‌దీప్‌(78) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఒకానొక దశలో ఛత్తీస్‌గడ్‌ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సుమిత్‌(40), అజయ్‌ జాదవ్‌(26)లతో కలిసి అమన్‌దీప్‌ పోరాడు. దీంతో కర్ణాటక ముందు ఛత్తీస్‌గడ్‌ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది. కన్నడ బౌలర్లలో కౌశిక్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిథున్‌, గౌతమ్‌, ప్రవీణ్‌ దుబేలు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

ఇక బుధవారమే జరిగిన మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన గుజరాత్‌ 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ధృవ్‌ రావల్‌(40), అక్షర్‌ పటేల్‌(37)లు మాత్రమే పర్వాలేదనిపించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పార్థీవ్‌ పటేల్‌(13), ప్రియాంక్‌ పాంచల్‌(3) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో స్వల్స స్కోర్‌కే గుజరాత్‌ పరిమితమైంది. కాగా, తమిళనాడు బౌలర్లలో మహమ్మద్‌ 3 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, ఆర్‌ అశ్విన్‌, మురుగన్‌ అశ్విన్‌, అపరజిత్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

గుజరాత్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌(32) విజయానికి పునాది వేయగా.. షారుఖ్‌ ఖాన్‌(56 నాటౌట్‌) తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. వీరికితోడు దినేశ్‌ కార్తీక్‌(47) కూడా తోడ్పాటునందించడంతో తమిళనాడు గెలుపును సొంతం చేసుకుంది. ఇక విజయ్‌ హజరే ట్రోఫీలో భాగంగా తమిళనాడు, కర్ణాటక జట్లు శనివారం ఫైనల్లో తలపడనున్నాయి. 

మరిన్ని వార్తలు