ముంబై ఆశలపై వర్షం

22 Oct, 2019 03:52 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు

లీగ్‌లో ఎక్కువ విజయాలతో సెమీస్‌ చేరిన ఛత్తీస్‌గఢ్‌

విజయ్‌ హజారే ట్రోఫీ

ఆలూరు (బెంగళూరు): విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో ముంబై సెమీస్‌ చేరే అవకాశాన్ని వర్షం అడ్డుకుంది.  ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై విజయం దిశగా సాగుతున్న దశలో వర్షం రావడం... వాన ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాకుండానే రద్దయింది. దాంతో నిబంధనల ప్రకారం లీగ్‌ దశలో ముంబై (4) కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఛత్తీస్‌గఢ్‌ (5)కు సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌గఢ్‌ 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులతో ఉన్న సమయంలో వాన కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వీజేడీ పద్ధతి ద్వారా ముంబై లక్ష్యాన్ని 40 ఓవర్లలో 192 పరుగులుగా నిర్ణయించారు.

లక్ష్య ఛేదనలో ముంబై 11.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 95 పరుగులతో ఉండగా... వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (38 బంతుల్లో 60 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. తమిళనాడు, పంజాబ్‌ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగానే రద్దయింది. మొదట తమిళనాడు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 39 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. పంజాబ్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులతో ఉన్న సమయంలో వాన కారణంగా మ్యాచ్‌ రద్దయింది. దీంతో లీగ్‌ దశలో పంజాబ్‌ (5) విజయాల కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన తమిళనాడు (9) సెమీస్‌ చేరింది. 23న జరిగే సెమీఫైనల్స్‌లో కర్ణాటకతో ఛత్తీస్‌గఢ్‌; గుజరాత్‌తో తమిళనాడు తలపడతాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు