మాల్యాకు ఊహించని పరిణామం..ఎవరితో వచ్చాడు?

10 Jun, 2019 08:34 IST|Sakshi

ఓవల్‌  మైదానంలో మాల్యాకు   ఊహించని  పరిణామం

‘‘దొంగ..దొంగ ’’ - ప్రేక్షకుల అరుపులు

ఎవరితో వచ్చాడో తెలుసా? కొడుకు సిద్ధార్థ్‌ మాల్యాతో

లండన్‌ :  ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఫ్యుజిటివ్‌  నేరగాడు విజయ్‌ మాల్యాకు  ఊహించని పరిణామం ఎదురైంది. ఐసీసీ వరల‍్డ్‌ కప్‌ 2019లో భాగంగా ఆదివారం ఓవల్‌ మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ను చూడ్డానికి వచ్చిన మాల్యాకు ఒక్కసారిగా షాక్‌తగిలింది. అక్కడున్నజనం చోర్‌..చోర్‌ (దొంగ..దొంగ) అని అరవడం మొదలుపెట్టారు. దేశానికి క్షమాపణ చెప్పు అంటూ నినాదాలు కూడా వినిపించాయి. వారికి ఏదో సమాధానం ఇచ్చినప్పటి కంగుతినడం మాత్రం మాల్యా వంతైంది.  

క్రికెట్‌ మ్యాచ్‌లను తరచుగా వీక్షించే మాల్యాకు అంతకుముందెప్పుడూ ఇలాంటి చేదు అనుభవం  ఎదురు కాలేదు. ఈ పరిణామంపై విలేకరులు ప్రశ్నించినపుడు తాను మ్యాచ్‌  చూడ్డానికి వచ్చానని, జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు.  అలాగే తన తల్లి  (దేశం) బాధపడకుండా చూడాలనేది  తన ప్రయత్నం అని చెప్పి వెళ్లిపోయాడు.  

మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న మాల్యా భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌కు కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యాతో కలిసి వచ్చాడు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించిన మ్యాచ్‌ను తన కొడుకుతో కలిసి చూడటం సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా  విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత టీమ్‌కు అభినందనలు తెలిపాడు.

కాగా రూ. 9వేల కోట్లకు పైగా బకాయిపడి లండన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాని తిరిగి భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అటు మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు