శ్రీలంకను కుమ్మేశారు..!

2 Dec, 2017 16:26 IST|Sakshi

ఢిల్లీ: శ్రీలంకతో  జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్‌ మురళీ విజయ్‌-కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించారు. తొలుత 163 బంతుల్లో శతకం సాధించిన విజయ్‌.. 251 బంతుల్లో 150 పరుగులు నమోదు చేశాడు.  ఆపై కాసేపటికి కోహ్లి 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. 178 బంతుల్లో 150 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ మూడో వికెట్‌కు 283 పరుగులు సాధించిన తరువాత  విజయ్‌(155) అవుటయ్యాడు. మురళీ విజయ్‌ అవుటైన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రహానే(5) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కోహ్లి(156 బ్యాటింగ్‌)కు జతగా రోహిత్‌ శర్మ(6 బ‍్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు.


అంతకుముందు కోహ్లి 110 బంతుల్లో  14 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా రెండు సందర్బాల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో కోహ్లి (తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో104 నాటౌట్‌, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 213పరుగులు) రెండు శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. గతంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ‍్యతలు చేపట్టిన కోహ్లి వరుసగా మూడు శతకాలు సాధించాడు.

 మరొకవైపు ఇది కోహ్లి టెస్టు కెరీర్‌లో 20వ శతకం కాగా, ఈ ఏడాది ఐదో సెంచరీ. కేవలం ఈ ఏడాది లంకపైనే నాల్గో టెస్టు సెంచరీను కోహ్లి సాధించాడు. అయితే సొంతమైదానంలో విరాట్‌కు ఇది తొలి టెస్టు సెంచరీ కావడం ఇక్కడ మరో విశేషం.  ఇదిలా ఉంచితే, కోహ్లి ఓవరాల్‌ కెరీర్‌లో ఇది 52వ సెంచరీ  కాగా, ఈ ఏడాది 11 సెంచరీలను సాధించాడు.

మరిన్ని వార్తలు