ఇద్దరూ ఒక్కటే!

6 May, 2019 02:42 IST|Sakshi

లీగ్‌ దశలో రాయుడు, విజయ్‌ శంకర్‌ 219 పరుగులు, 19.90 సగటు

ప్రపంచ కప్‌ రేసులో అంబటి రాయుడు ను వెనక్కి నెట్టి విజయ్‌ శంకర్‌ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అసంతృప్తితో రాయుడు ‘3డి’ వ్యంగ్య వ్యాఖ్యానం కూడా చేశాడు. ఆ తర్వాతి నుంచి ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది. అయితే ఇప్పుడు సరిగ్గా లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి ఇద్దరిలో ఎవరు మెరుగైన ఆటగాడో చెప్పలేని విధంగా వారిద్దరు గణాంకాలు నమోదు చేశారు. చెన్నై తరఫున రాయుడు, సన్‌రైజర్స్‌ తరఫున శంకర్‌ అన్ని మ్యాచ్‌లు (14) ఆడారు. ఇందులో ఒక మ్యాచ్‌లో శంకర్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాలేదు.

చివరకు ఇద్దరూ కూడా సరిగ్గా 219 పరుగులే నమోదు చేయగా... సగటు కూడా (19.90) ఒకేలా ఉండటం యాదృచ్ఛికం! ఒక అర్ధ సెంచరీ చేసిన రాయుడు బౌండరీల ద్వారా 92 పరుగులు సాధించగా... 40 పరుగుల అత్యధిక స్కోరు సాధించిన శంకర్‌ దాదాపు అదే విధంగా 96 పరుగులు బౌండరీల నుంచి రాబట్టాడు. బౌలింగ్‌లోనూ కేవలం 8 ఓవర్లే వేసి ఒక వికెట్‌ తీసిన శంకర్‌ ప్రదర్శన పెద్దగా చెప్పుకోదగింది కాదు. బ్యాటింగ్‌ స్ట్రయిక్‌రేట్‌లో మాత్రం రాయుడు (90.49)కంటే శంకర్‌ (120.32) కొంత మెరుగ్గా ఉన్నాడు.  

జాదవ్‌కు గాయం...
మరోవైపు వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యుడైన కేదార్‌ జాదవ్‌ మళ్లీ గాయం బారిన పడ్డాడు. పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా జాదవ్‌ ఫీల్డింగ్‌ చేస్తూ కింద పడ్డాడు. దాంతో అతని భుజానికి గాయమైంది. జాదవ్‌కు సోమవారం ఎక్స్‌రే, స్కానింగ్‌ నిర్వహించనున్నట్లు చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ నిర్ధారించారు.  పరిస్థితి తీవ్రంగా ఉంటే మాత్రం అతను ప్రపంచ కప్‌కు దూరమైనట్లే! భారత వన్డే విజయాల్లో కీలక భాగంగా ఉన్న జాదవ్‌ ఐపీఎల్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 95.85 స్ట్రయిక్‌ రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు. 

>
మరిన్ని వార్తలు