'కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా'

26 Jun, 2020 11:09 IST|Sakshi

ఢిల్లీ : ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌ అంటే ఆ మజా ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోనే కాదు బయట కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 2019 ప్రపంచకప్‌ సందర్భంగా జూన్‌ 16న మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో లీగ్‌ మ్యాచ్‌కు ఒకరోజు ముందు జరిగిన ఘటనను తాజాగా విజయ్‌శంకర్ భారత్‌ ఆర్మీ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ‌ గుర్తు చేసుకున్నాడు. ' పాక్‌తో మ్యాచ్‌కు ఒకరోజు ముందు జట్టు మేనేజ్‌మెంట్‌ నా దగ్గరకు వచ్చి రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావు. సిద్ధంగా ఉండు అని చెప్పడంతో నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత అదే రోజు కొంతమంది ఆటగాళ్లం కాఫీ కోసమని బయటకు వెళ్లాం. అదే సమయానికి అక్కడికి వచ్చిన పాక్‌ అభిమాని మా వద్దకు వచ్చి ఏవో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా చేస్తుంటే చాలా కోపం వచ్చింది. అయితే చూస్తూ ఊరుకున్నాం తప్ప అతన్ని ఏం చేయలేకపోయాం. భారత్‌- పాక్‌కు మ్యాచ్‌ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో  అప్పుడే నాకు మొదటిసారి తెలిసింది ' అని పేర్కొన్నాడు.(అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర)

2019 ప్రపంచకప్‌కు అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడుని కాదని త్రీ డైమన్షనల్‌ ప్లేయర్‌ అంటూ విజయ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కాగా శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్‌ శంకర్‌.. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్‌మెంట్‌ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్‌ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్‌కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్‌ శంకర్‌ వేశాడు.

తాను వేసిన తొలి బంతికి ఇమాముల్‌ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్‌లో సర్ఫరాజ్‌ వికెట్‌ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో తుది జట్టుకు ఎంపికైన విజయ్‌ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు, విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే అంతలోనే కాలి బొటనవేలి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అప్పటినుంచి ఒకవన్డే మ్యాచ్‌ కూడా ఆడలేదు. మొత్తంగా టీమిండియా తరపున 12 వన్డేల్లో 223 పరుగులు, 4 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు