టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

1 Jul, 2019 15:04 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేతి వేలి గాయంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, తాజాగా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కథ కూడా ముగిసింది. గత కొన్ని రోజులుగా మడమ గాయంతో బాధపడుతున్న విజయ్‌ శంకర్‌ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగక తప్పలేదు.  ఈ టోర్నీలో విజయ్‌ శంకర్‌ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లలో ఆడాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శంకర్‌.. విండీస్‌, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే భారత్‌ ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నాల్గో స్థానం  అవకాశాన్ని విజయ్‌ శంకర్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ సంద‌ర్భంగా జ‌స్‌ప్రీత్ బుమ్రా సుమారు 140 కిలోమీట‌ర్ల వేగంతో వేసిన ఓ యార్క‌ర్‌.. నేరుగా అత‌ని పాదాల‌ను తాకింది. దాని దెబ్బ‌కు అక్క‌డిక‌క్క‌డే కూల‌బ‌డిపోయాడు విజ‌య్ శంక‌ర్‌. కుంటుకుంటూ నెట్స్ నుంచి త‌న గదికి వెళ్లిపోయాడు. ఆ త‌రువాత విజ‌య్ శంక‌ర్ ఈ గాయం నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ.. అది తాత్కాలిక‌మే. మడ‌మ‌ల్లో గాయం, వాపుతో బాధ‌ప‌డుతూనే అత‌ను అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ ఆడకపోవడానికి అతని గాయం తిరగబెట్టడమే ప్రధాన కారణం.

నాలుగేళ్ల‌కోసారి జ‌రిగే వరల్డ్‌కప్‌ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ఆడాల‌నేది ఏ క్రికెట‌ర్ అయినా కోరుకుంటాడు. దీని కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తారు. సెలెక్ట‌ర్ల కంట్లో ప‌డ‌టానికి చెమ‌టోడ్చుతారు. అలాంటి అద్భుత అవ‌కాశాన్ని అనుకోకుండా, అనూహ్యం ద‌క్కించుకున్నాడు ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్‌. ఆల్ రౌండ‌ర్ అనే ఒకే ఒక్క కార‌ణంతో విజ‌య్ శంక‌ర్ కంటే సీనియ‌ర్ల‌యిన‌, అత‌ని కంటే బాగా రాణించిన వారిని కూడా ప‌క్కన పెట్టారు సెలెక్ట‌ర్లు. ప్ర‌పంచ‌క‌ప్ మెగా టోర్న‌మెంట్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో విజ‌య్ శంక‌ర్‌కు అవ‌కాశం క‌ల్పించారు. కాగా, టోర్నీ నుంచి ఇలా అర్థాంతరంగా వైదొలగడంతో భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పాలి.

అతని స్థానంలో కర్ణాటక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను స్టాండ్‌ బై తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అందుకు ఐసీసీ అనుమతి ఇస్తే మయాంక్‌ అగర్వాల్‌ భారత్‌ వరల్డ్‌కప్‌ జట్టులో సభ్యుడిగా మారతాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ నిష్క్రమించిన తర్వాత అతని స్థానంలో స్టాండ్‌ బైగా రిషభ్‌ పంత్‌ను తీసుకున్నారు. కాగా, ఇప్పుడు విజయ్‌ శంకర్‌ గాయంతో వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగిన నేపథ్యంలో అంబటి రాయుడికి ఛాన్స్‌ వస్తుందని అంతా ఊహించారు. కానీ, అంబటి రాయుడు జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి పిలుపు అందకపోగా, భారత వరల్డ్‌ కప్‌ స్టాండ్‌ బై ఆటగాడిగా లేని మయాంక్‌ అగర్వాల్‌ను తీసుకోవడానికి మొగ్గుచూపడం చర్చనీయాంశంగా మారింది.

గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా మయాంక్‌ అగర్వాల్‌ టెస్టు ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన  మయాంక్‌ అగర్వాల్‌.. రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 77.  కాగా, వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేయాల్సి ఉంది. ఇక లిస్ట్‌ -ఎ క్రికెట్‌లో 75 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ 48.71 సగటుతో 3,605 పరుగులు చేశాడు.  2019 ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన మాయంక్‌ అగర్వాల్‌ 141.88 స్టైక్‌ రేట్‌తో 332 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలున్నాయి.


 

మరిన్ని వార్తలు