‘ధోని నుంచే అది నేర్చుకున్నా’

13 Feb, 2019 11:28 IST|Sakshi

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌

చెన్నై : ప్రపంచకప్‌కు భారత జట్టు దాదాపు ఖరారు అనుకుంటున్న సందర్భంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోని.. తాను ప్రపంచకప్‌లో ఆడగలనని సవాల్‌ విసురుతున్న టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌.. ఛేజింగ్‌ తత్వాన్ని సీనియర్‌ క్రికెటర్‌ ధోనిని చూసే నేర్చుకున్నానని తెలిపాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో అదరగొట్టిన ఈ యువ ఆల్‌రౌండర్‌.. తన ప్రదర్శనపై మీడియాతో సంతృప్తిని వ్యక్తం చేశాడు. సీనియర్‌ క్రికెటర్లు ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలతో డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం.. తన కలని, అది నేరవేరిందని, ఇది తన జీవితంలోనే ఓ గొప్ప అనుభూతిగా అభివర్ణించాడు.

‘సీనియర్ల మధ్య ఆడటం చాలా సంతోషంగా ఉంది. వారి ఆటను గమనిస్తూ ఎంతో నేర్చుకుంటున్నా. ముఖ్యంగా ఛేజింగ్‌ విషయంలో ధోనిని చూసి ఇప్పటికే ఎంతో నేర్చుకున్నా. ఆ కఠిన పరిస్థితుల్లో ఎలా ప్రశాంతంగా ఆడాలో, అతని మైండ్‌సెట్‌ను చూసే అలవర్చుకున్నాను. కోహ్లి, ధోని, రోహిత్‌ శర్మలతో డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్ల ఆటను పరిశీలిస్తూ వారి నుంచి నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. చివరి టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగమని టీమిండియా మేనేజ్‌మెంట్‌ అడగడం నిజంగా నాకు పెద్ద సర్‌ప్రైజ్. సిరీస్‌ ముందే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్దంగా ఉండాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ నాకు చెప్పింది.  దాంతో పరిస్థితిని బట్టి బ్యాటింగ్‌ చేయడంపై దృష్టి సారించా. ఈ సిరీస్‌లో నేను ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. చివరి టీ20 పరాజయం నిరాశకు గురి చేసింది. నాకు మంచి అనుభవం లభించింది. నేను ఇంకా వేగాన్ని, స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవాలి.’ అని అభిప్రాయపడ్డాడు.

వెల్లింగ్టన్‌ వన్డేలో రాయుడితో నెలకొల్పిన అద్భుత భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘నేను క్రీజులోకి వచ్చినప్పుడు 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉంది. ఆ సమయంలో మంచి భాగస్వామ్యం అవసరం. కానీ ఆ కివీస్‌ బౌలర్లను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నది. రాయుడు నేను మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. నేనింకా పరుగులు చేయాల్సింది. జాతీయ జట్టులో చోటు కోసం ఇంకా కష్టపడుతాను. ప్రపంచకప్‌ స్థానం గురించి అంతగా ఆలోచించడం లేదు’ అని ఈ తమిళనాడు క్రికెటర్‌ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ప్రదర్శన ద్వారా విజయ్‌ శంకర్‌ ప్రపంచకప్‌ రేసులోకి దూసుకొచ్చాడు. రెండో పేస్‌ ఆల్‌ రౌండర్‌ స్థానానికి బలమైన పోటీదారుడయ్యాడు. అయితే, శంకర్‌కు చోటివ్వాలంటే కేదార్‌ జాదవ్‌ను పక్కన పెట్టాల్సి  ఉంటుంది.

చదవండి: ప్రపంచ కప్‌ తుది బెర్తు కొట్టేసేదెవరో?

మరిన్ని వార్తలు