భారత జట్టులో శుబ్‌మన్‌ గిల్‌కు చోటు

13 Jan, 2019 12:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా స్థానాలను శుబ్‌మన్‌ గిల్‌, విజయ్‌ శంకర్‌లతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) భర్తీ చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే గిల్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు టీమిం‍డియా వెళ్లే సమయంలో జట్టుతో కలుస్తాడు. ఇక విజయ్‌ శంకర్‌ మాత్రం ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో మంగళవారం జరిగే రెండో వన్డే కోసం జట్టులో కలవనున్నాడు.  ఇప్పటికే భారత్‌ తరఫున విజయ్‌ శంకర్‌ ఆడగా, శుబ్‌మాన్‌ గిల్‌ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గతేడాది జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును గిల్‌ గెలుచుకున్నాడు. 

మరోపక్క పాండ్య, రాహుల్‌లపై విచారణ త్వరగా ముగించాలని బీసీసీఐ పరిపాలన కమిటీ(సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ యోచిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో పాండ్యా, రాహుల్‌ ఇద్దరు మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.  అందులో 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ పాండ్యా మాట్లాడుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్‌ మై కర్‌ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేస్తూ పాండ్యా సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు కోరినప్పటికి బీసీసీఐ సంతృప్తి చెందలేదు. దాంతో వారిని సస్పెండ్‌ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వారిని ఆసీస్‌ పర్యటనుంచి తిరిగి భారత్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. వారిపై విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్‌ వేటు వేయడంతో రాహుల్‌, పాండ్యాలు ఎప్పుడు భారత జట్టులో పునరాగమనం చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు