టీమిండియాకు గాయాల బెడద

20 Jun, 2019 16:04 IST|Sakshi

సౌతాంప్టన్‌: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియాను గాయాల బెడద మాత్రం వేధిస్తోంది. ఇప్పటికే భారత స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేతి వేలి గాయంతో టోర్నీ నుంచి వైదొలగగా, భువనేశ్వర్‌ కుమార్‌ కండరాల గాయంతో బాధడపడుతున్నాడు. కాగా, టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కూడా మళ్లీ గాయం బారిన పడ్డాడు. శనివారం అఫ్గానిస్తాన్‌తో సౌతాంప్టన్‌లో మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా విజయ్‌ శంకర్‌కు గాయమైంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన యార్కర్‌కు విజయ్‌ శంకర్‌ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో విజయ్‌ శంకర్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు.  ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు విజయ్‌ శంకర్‌ అందుబాటులో ఉంటాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మెగాటోర్నీలో ఇంకా లీగ్‌ దశ పూర్తి కాకుండానే భారత క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడటం జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. దాంతో ఆటగాళ్లకు ఎటువంటి పెద్ద గాయాలు కాకుండా చూసుకోవడంపైనే దృష్టి సారించింది.(ఇక్కడ చదవండి: ధావన్‌ ఔట్‌)

వరల్డ్‌కప్‌ నుంచి ధావన్‌ నిష్క్రమించిన తర్వాత రిషభ్‌ పంత్‌ జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో పంత్‌ తుది జట్టులో ఉండే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ తుది జట్టులోకి వచ్చి బౌలింగ్‌లో మెరిశాడు. దాంతో అతన్ని అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కొనసాగించాలనే భావనలో టీమిండియా ఉంది. కాగా, విజయ్‌ శంకర్‌ కూడా గాయం బారిన పడటంతో అతను జట్టులో ఉండటంపై డైలమా ఏర్పడింది. ఒకవేళ మ్యాచ్‌నాటికి విజయ్‌ శంకర్‌ సిద్ధమైతే అతను జట్టులో ఉండటం దాదాపు ఖాయం. కానిపక్షంలో బౌలింగ్‌ విభాగం కాస్త బలహీన పడతుంది.


 

మరిన్ని వార్తలు