విజేందర్‌ సత్తాకు పరీక్ష

17 Dec, 2016 00:03 IST|Sakshi
విజేందర్‌ సత్తాకు పరీక్ష

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన అనంతరం అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్‌ సింగ్‌ మరో నాకౌట్‌ విజయంపై కన్నేశాడు. ప్రపంచ బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ పోరులో భాగంగా మాజీ ప్రపంచ చాంపియన్‌ ఫ్రాన్సిస్‌ చెకా (టాంజానియా)తో నేడు (శనివారం) విజేందర్‌ తలపడనున్నాడు. డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్‌ పది రౌండ్లపాటు ఫైట్‌ చేయనున్నాడు. ఇప్పటిదాకా విజేందర్‌కు ఎదురైన అత్యంత అనుభవశాలి బాక్సర్‌ చెకానే. అందుకే రింగ్‌లో సత్తా చూపిస్తానని సవాల్‌ విసిరాడు. అయితే ఇందుకు విజేందర్‌ దీటుగా స్పందించాడు. ‘పంచ్‌ విసరడమే నా పని. బౌట్‌లో అదే చేయబోతున్నాను. ఈ టైటిల్‌ ఎక్కడికీ పోదు’ అని అన్నాడు.

34 ఏళ్ల చెకా ఇప్పటిదాకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్‌ ఉండగా.. 16 ఏళ్ల కెరీర్‌లో 300 రౌండ్లలో తలపడ్డాడు. విజేందర్‌ కేవలం 27 రౌండ్లు మాత్రమే ఆడాడు. ఈ బౌట్‌తో పాటు ఐదు అండర్‌కార్డ్‌ బౌట్స్‌ కూడా జరుగుతాయి.  అన్ని బౌట్లు రాత్రి గం. 7.30 నుంచి 10.30 వరకు స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

మరిన్ని వార్తలు