విదేశీ కోచ్‌లకు జవాబుదారీతనం ఉండాలి

19 Mar, 2020 06:24 IST|Sakshi

కోచ్‌ విమల్‌ కుమార్‌ సూచన  

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ముందు భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విదేశీ కోచ్‌ ఫ్లాండీ లింపెలె (ఇండోనేసియా) తన పదవికి రాజీనామా చేయడం పట్ల భారత మాజీ బ్యాడ్మింటన్‌ కోచ్‌ విమల్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ మొత్తం చెల్లించి వారిని తీసుకుంటే బాధ్యతారాహిత్యంగా కీలక టోర్నీల ముందు చేతులెత్తేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ కోచ్‌లకు కచ్చితంగా జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘ఫ్లాండీ వెళ్లిన తీరు అనైతికం, దురదృష్టకరం.

భారత డబుల్స్‌ జోడీ దాదాపుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. డబుల్స్‌లో మనకు మంచి ఫలితాలు రానున్న ఈ తరుణంలో ఆయన పదవీ కాలాన్ని ముగించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోవడం నిరాశ కలిగించింది. జనవరిలో నేను ఫ్లాండీతో చాలాసేపు చర్చించాను. ఆయన మన ఆటగాళ్ల గురించి మాట్లాడారు. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి సరిదిద్దుతానన్నారు. కానీ ఇలా ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీకి ముందే మధ్యలోనే వెళ్లిపోయారు. ఇది సరి కాదు’ అని భారత్‌ బ్యాడ్మింటన్‌కు 2003 నుంచి 2006 వరకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించిన విమల్‌ అసహనం వ్యక్తం చేశారు. గతేడాది మార్చిలో డబుల్స్‌ కోచ్‌గా నియమితులైన లింపెలె... కుటుంబ కారణాలను చూపిస్తూ పదవీకాలం ముగియకుండానే భారత కోచ్‌ పదవికి రాజీనామా చేశారు.

ఇలా చేసిన నాలుగో విదేశీ కోచ్‌ లింపెలె. అతని కన్నా ముందు పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన కొరియా కోచ్‌ కిమ్‌ జీ హ్యూన్, ఇండోనేసియా కోచ్‌ ముల్యో హండాయో, మలేసియా కోచ్‌ టాన్‌ కిమ్‌ పలు కారణాలతో ఇలాగే పదవీ కాలం ముగియకుండానే వెళ్లిపోయారు. ప్రతీసారి ఇలాగే జరుగుతుండటంతో విదేశీ కోచ్‌లను నియమించే సమయంలోనే కఠిన నిబంధనలు విధించాలని విమల్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ‘కోచ్‌లకు జవాబుదారీతనం ఉండేలా నిబంధనలు రూపొందించాలి. వారికి నిర్దేశించిన పనికి, వ్యక్తులకు వారే బాధ్యులుగా ఉండేలా ఫలితాలు రాబట్టేలా కాంట్రాక్టులోనే నియమాలు పొందుపరచాలి. విదేశీ కోచ్‌లకు చాలా పెద్ద మొత్తం ఇస్తున్నాం. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోకూడదు’ అని విమల్‌ అన్నారు. ఇప్పటివరకు భారత్‌ నుంచి సింగిల్స్‌లో సింధు, సాయి ప్రణీత్‌తో పాటు డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టి–సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ మాత్రమే ప్రస్తుతానికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు