గాయంతో వినేశ్ నిష్ర్కమణ

18 Aug, 2016 02:06 IST|Sakshi
గాయంతో వినేశ్ నిష్ర్కమణ

 మరోరోజు భారత్‌కు నిరాశ
 రియో డి జనీరో: ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత మహిళా రెజ్లర్లు నిరాశ పరిచారు. ఫలితంగా రియో ఒలింపిక్స్‌లో మరో రోజు భారత్‌కు పతకం లేకుండానే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్లో గాయంతో మధ్యలోనే వైదొలిగింది. సన్ యానన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ స్కోరు 1-2తో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి పట్టు కారణంగా వినేశ్ మోకాలు తిరగబడింది. దాంతో భరించలేని నొప్పితో వినేశ్ మ్యాట్‌పైనే పడిపోయి విలవిలలాడింది.
 
  వైద్యులు వెంటనే వచ్చి ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు. చైనా రెజ్లర్ సన్ యానన్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు తొలి రౌండ్‌లో వినేశ్ 11-0తో ఎమిలియా అలీనా (రొమేనియా)పై విజయం సాధించింది.మరోవైపు 58 కేజీల విభాగంలోనూ భారత రెజ్లర్ సాక్షి మలిక్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో 5-4తో జోనా మాట్సన్ (స్వీడన్)పై నెగ్గిన సాక్షి... రెండో రౌండ్‌లో మరియానా చెర్దివారా (మాల్డొవా)పై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది.
 
 హీట్స్‌లోనే టింటూ లూకా అవుట్
 అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జరిగిన మహిళల 800 మీటర్ల విభాగంలో టింటూ లూకా తొలి హీట్‌లోనే వెనుదిరిగింది. టింటూ 2 నిమిషాల 00.58 సెకన్లలో గమ్యానికి చేరి తన హీట్‌లో ఆరో స్థానంలో... ఓవరాల్‌గా 65 మందిలో 29వ స్థానంలో నిలిచింది.
 

>
మరిన్ని వార్తలు