మెరిసి.. అంతలోనే అలసి

17 Sep, 2019 16:49 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు చుక్కెదురైంది. ఎన్నో అంచనాలతో టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఫొగట్‌కు నిరాశే ఎదురైంది. 53 కేజీల కేటగిరీలో భాగంగా మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో ఫొగట్‌ 0-7 తేడాతో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌, జపాన్‌ రెజ్లర్‌ మయు ముకైదా చేతిలో పరాజయం చెందారు. దాంతో టైటిల్‌ను సాధించే అవకాశం ఫొగట్‌ కోల్పోయారు. ఇది మయు ముకాదాపై వరుసగా రెండో పరాజయం. గతంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ముకైదా చేతిలో ఓటమిని చవిచూసిన వినేశ్‌ పొగొట్‌.. మరోమారు పరాజయం చెందారు.

ఫొగట్‌ చేతిలో గెలిచిన ముకైదా.. ఆపై సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ క్రమంలోనే ముకైదా ఫైనల్‌కు చేరితే ఫొగట్‌కు మరో అవకాశం ఉంటుంది. రెప్‌చెజ్‌ ద్వారా తన అదృష్టాన్ని ఫొగట్‌ పరీక్షించుకునే అవకాశం దక్కుతుంది. ఒకవేళ ముకైదా ఫైనల్‌కు వెళ్లని పక్షంలో ఫొగట్‌ పతకం ఆశలతో పాటు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు కూడా క్లిష్టంగా మారుతుంది.అంతకుముందు ఈ రోజు జరిగిన పోరులో ఫొగట్‌.. 12-0 తేడాతో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, స్వీడన్‌ రెజ్లర్‌ సోఫియా మాట్సన్‌పై ఘన విజయం సాధించారు. ఫలితంగా ప్రి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఏ దశలోనూ సోఫియాకు అవకాశం ఇవ్వని వినేశ్‌.. చివరకు సోఫియాను మ్యాట్‌ నుంచి బయటకు నెట్టడంతో భారీ ఆధిక్యం సాధించారు. అయితే వినేశ్‌ గెలిచే క్రమంలో కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సోఫియాను మొత్తం మ్యాట్‌ నుంచి ఔట్‌ చేసిన సమయంలో వినేశ్‌  కాలు లైన్‌ లోపల ఉందా.. బయట ఉందా అనే దానిపై స్పష్టత రాలేదు. అదే సమయంలో సోఫియా చాలెంజ్‌కు వెళ్లడంతో రిఫరీలు పలు కోణాలు పరిశీలించి వినేశ్‌ కాలు లైన్‌ లోపలే ఉందని తేల్చారు. దాంతో వినేశ్‌ 12-0 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు అడుగుపెట్టారు. అటు తర్వాత  జరిగిన బౌట్‌లో వినేశ్‌ ఫొగట్‌కు పరాజయం తప‍్పలేదు. ఇప్పుడు ఫొగట్‌ రెప్‌చెజ్‌లోకి రావాలంటే.. ముకైదా ఫైనల్‌కు  చేరాల్సి ఉంటుంది. రెజ్లింగ్ ‘డ్రా’లో రెండు పార్శ్వాల నుంచి ఇద్దరు ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఫైనల్‌కు చేరిన వారిద్దరి చేతుల్లో ఎవరైతే ఓడిపోయారో వారందరికీ ‘రెప్‌చేజ్’ ద్వారా మరో అవకాశం కల్పిస్తారు. ఇక్కడ కేవలం కాంస్య పతకాన్ని సాధించే అవకాశం మాత్రమే ఉంటుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు