‘అతనికి ఈ-మెయిల్స్‌ రాయడమే పని’

4 Aug, 2018 13:33 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు పరిపాలన కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్ రాయ్‌పై బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు అమితాబ్‌ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. జస్టిస్ లోధా సూచించిన సిఫారసులను అమలు చేయడంలో వినోద్‌ రాయ్ పూర్తిగా విఫలమయ్యాడని అమితాబ్‌ విమర్శించారు. చాలాకాలంగా అమితాబ్‌తో పాటు కోశాధికారి అనిరుధ్ చౌదురిని పక్కనబెట్టిన సీఓఏ కీలక అంశాలను వీళ్లతో చర్చించడం లేదు.  అదే సమయంలో వీరిని తొలగించాలని సుప్రీంకోర్టుకు రాయ్ విజ్ఞప్తి చేయడం కూడా అమితాబ్‌ చౌదరికి ఆగ్రహం తెప్పించింది..

ఈ నేపథ్యంలో రాయ్ తీసుకున్న నిర్ణయాలపై అమితాబ్ చౌదరి బహిరంగంగా విమర్శలు చేసేందుకు పూనుకున్నాడు. ‘రాయ్ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చా. దురదృష్టమేమిటంటే ఏడాదిన్నరగా అతను ఈ మెయిల్స్ రాయడానికే పరిమితమయ్యాడు. అంతకుమించి అతను సాధించిందేమీ లేదు. సిఫారసులు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా వాటిని ఇంతవరకు అమలు చేయలేకపోయాడు. లోధా సిఫారుసులు అమలు విషయంలో రాయ్ బృందం పూర్తిగా విఫలమైంది. ఆఫీస్ బేర్లర్లను తొలిగించడానికి రాయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అతని వైఫల్యాన్ని మేం ప్రశ్నిస్తామనే భయం మొదలైంది. నియామకాలు జరపడంలో రాయ్ బిజీగా ఉన్నారు. ఇక మిగతా విషయాలేమి పట్టించుకుంటారు’ అని అమితాబ్‌ చౌదరి విమర్శించారు.

బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు అవసరమైన తుది తీర్పును వెల్లడించడంలో సుప్రీంకోర్టు కాలాయపన చేస్తుందని ఇటీవల రాయ్ చేసిన విమర్శలపై కూడా అమితాబ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అత్యున్నత న్యాయస్థానం గురించి రాయ్ అలా ఎలా మాట్లాడతారని ప‍్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వంలో పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు