హార్దిక్‌, రాహుల్‌పై చర్యలకు బీసీసీఐ సిద్ధం

10 Jan, 2019 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ టీవీ షోలో మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌పై చర్యలను తీసుకునేందుకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. ఆ ఇద్దరిపై రెండు వన్డే మ్యాచ్‌లు నిషేధం విధించాలని బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్‌ రాయ్‌ ప్రతిపాదించారు. ఈ మేరకు సీఓఏ సభ్యురాలు డయానా ఎడ్జుల్లీ న్యాయపరమైన సలహా కోరేందుకు సన్నద్ధమయ్యారు. ‘మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన తర్వాత హార్దిక్‌ ఇచ్చిన వివరణతో నేను సంతృప్తి చెందలేదు. దాంతో వారిపై రెండు మ్యాచ్‌లు నిషేధం విధించాలని సూచించా. అయితే దీనిపై న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత డయానా ముందుకు వెళతారు’ అని వినోద్‌ రాయ్‌ పేర్కొన్నారు.

ప్రముఖ  షో అయిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్‌ జోహార్‌తో కలిసి హార్దిక్‌, రాహుల్‌లు పాల్గొన్నారు.  అందులోపాండ్యా మాట్లా డుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్‌ మై కర్‌ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు.

18 ఏళ్ల వయసప్పుడే తన ప్యాంట్‌ జేబులో కండోమ్‌ లభించడాన్ని వాళ్ల అమ్మ తండ్రి దృష్టికి తీసుకెళ్లిందని,  మొదట మందలించినా... తర్వాత ‘పర్లేదు...రక్షణ కవచం వాడావు’ అని తండ్రి తనతో అన్నట్లు షోలో రాహుల్‌ చెప్పుకొచ్చాడు.కాంట్రాక్టు క్రికెటర్లయి ఉండి ఇలా అశ్లీల రీతిలో విచ్చలవిడితనంతో వ్యాఖ్యానించిన సదరు క్రికెటర్లకు వినోద్‌ రాయ్‌ నోటీసులు పంపారు. ఈ నోటీసులు రాగానే పాండ్యా ట్విట్టర్‌ వేదికగా మహిళలను క్షమాపణలు కోరాడు. ‘ఆ ఊపులో చెప్పేశాను. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలి’ అని అన్నాడు. దీనిపై ఎంతమాత్రం సంతృప్తి చెందని వినోద్‌ రాయ్‌.. వారిని కనీసం రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్‌ చేయడమే సరైన శిక్షగా పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా