300 ఛేజింగ్‌ల్లో కోహ్లి ఇలా..

23 Dec, 2019 11:16 IST|Sakshi

కటక్‌: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీల రికార్డుకు 6 శతకాల దూరంలో ఉన్నాడు కోహ్లి. ఇప‍్పటివరకూ  43  వన్డే సెంచరీలను  ఖాతాలో వేసుకున్న కోహ్లి.. ప్రత్యేకంగా ఛేజింగ్‌ల్లో తనదైన మార్కును చూపెడుతూ దూసుకుపోతున్నాడు. ప్రధానంగా 300 పరుగులు, అంతకంటే ఎక్కువ పరుగుల ఛేజింగ్‌ చేయాల్సిన వచ్చిన సందర్భాల్లో కోహ్లి ఇన్నింగ్స్‌ కసితో ఆడతాడు.. కసిదీరా కొడతాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లి బ్యాట్‌తో చెలరేగిపోయాడు.(ఇక్కడ చదవండి: టీమిండియా రికార్డులు.. విశేషాలు)

వందకు  పైగా స్టైక్‌ రేట్‌తో 85 పరుగులు సాధించి జట్టు పరిస్థితిని గాడిలో పెట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, టీమిండియా తరఫున ఆడుతూ 300 పరుగులకు పైగా ఛేజింగ్‌ను  చేరుకోవాల్సిన  తరుణంలో కోహ్లి ఇప్పటివరకూ 9 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు  నమోదు చేశాడు. ఇక్కడ కోహ్లి స్టైక్‌ రేట్‌ 107.13 ఉండగా, యావరేజ్‌ 62.  25గా ఉంది. 300 పరుగులకు పైగా ఛేజింగ్‌ల్లో కోహ్లి 31 ఇన్నింగ్స్‌లు ఆడి 1,743 పరుగులు సాధించాడు.  ఇందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. 2012 ఆసియాకప్‌లో భాగంగా మిర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 330 పరుగుల  టార్గెట్‌ను టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 148 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 183 పరుగులు సాధించాడు.  వన్డేల్లో కోహ్లి ఓవరాల్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా  ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తలు