ఆకాశమే హద్దు

15 May, 2016 14:59 IST|Sakshi
ఆకాశమే హద్దు

క్రికెట్ పుస్తకంలో ఉండే ప్రతీ షాట్ ఆడే ఆటగాడు ఒక వైపు... ఏ పుస్తకంలోనూ చదవని, రాతల్లో కనిపించని షాట్లు ఆడే ఆటగాడు మరో వైపు... ఈ ఇద్దరు జత కలిస్తే, ఒకరితో మరొకరు పోటీ పడితే పరుగుల ప్రవాహానికి అడ్డు ఉంటుందా... వీర విధ్వంసానికి విరామం ఉంటుందా. అక్షరాలను అందంగా పేర్చే సంప్రదాయ వ్యాకరణ కవి ఒకరైతే... నిబంధనల అడ్డుగోడలు, ప్రాసల  కట్టుబాట్లు లేకుండా తనకు నచ్చిన రీతిలో చెలరేగే విప్లవ రచయిత మరొకరు... ఈ ఇద్దరు ఒకే వేదికపైనుంచి సునామీ తరహాలో ప్రదర్శించిన ‘షో’ ఇది.

ఒకటా, రెండా... రెండు పదుల సంఖ్యలో సిక్సర్లతో రెండు వైపులనుంచి పెను దాడి చేస్తుంటే, అలా మొహమాటం కొద్దీ బంతులు విసరడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి బౌలర్లది. డివిలియర్స్, కోహ్లి భారీ షాట్లతో విరుచుకు పడిన వేళ చిన్నస్వామి స్టేడియం మరింత చిన్నదిగా కనిపించింది. రొనాల్డో, మెస్సీలు ఒకే జట్టులో కలిసి ఆడినట్లు... ఫెడరర్, నాడల్ కలిసి డబుల్స్ మ్యాచ్ బరిలోకి దిగినట్లు ఇద్దరు అద్భుత ఆటగాళ్ల ఆటను ఒకే ఫ్రేమ్‌లో చూపించగలిగిన ఐపీఎల్‌కు నమో నమ అనకుండా ఉండగలమా.
 

 సాక్షి క్రీడా విభాగం ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ విధ్వంసం చూడటం ఇదేమీ మొదటిసారి కాదు. కానీ ఒకరు చెలరేగిన చోట మరొకరు నెమ్మదించడం, ఒకరు బాదుతుంటే, మరొకరిని అడ్డుకోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ ఇద్దరు సూపర్ స్టార్‌లు నేనంటే నేనంటూ తమలో తాము రేస్ పెట్టుకున్నట్లు షాట్లతో బెంబేలెత్తించడం, ఒకరి వెనుక మరొకరు శతకాలతో పరస్పరం పండగ చేసుకోవడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి ఆటను డివిలియర్స్, కోహ్లి చూపించారు.


ఆ షాట్లకు పేరేమిటి?
‘డివిలియర్స్ మా బౌలర్లతో మజాక్ చేస్తున్నట్లున్నాడు. తాంబే బౌలింగ్ పాయింట్ మీదుగా కొట్టిన ఆ షాట్ నిజంగా ఒక పెద్ద జోక్’ ... మ్యాచ్ మధ్యలో భారత టాప్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ ఇది. నిజంగానే అతను అలాంటి షాట్ ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. కానీ డివిలియర్స్‌కు ఇది కొత్తేం కాదు. ఇలాంటివి గతంలో ఎన్నడూ చూడనివి, ఆడనివి కొత్త కొత్తగా ప్రదర్శించడం అతనికి ఏ, బీ లు నేర్చుకునేనాటినుంచే అలవాటైన విద్య. బంతి దాదాపుగా కీపర్ చేతుల్లో పడే సమయంలో పూర్తిగా శరీరాన్ని పాయింట్ వైపు తిప్పేసి డ్రైవ్ చేయడం అద్భుతం! ఈ ఇన్నింగ్స్ ఆసాంతం డివిలియర్స్ అదే విధ్వంసాన్ని కొనసాగించాడు. ధావల్ ఓవర్లో వరుసగా 6, 4, 4తో 25బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ముఖ్యంగా అతని స్లాగ్ స్వీప్‌లు పరుగుల పంట పండించాయి.

బంతి బ్యాట్ మధ్యలో తగలకపోయినా టాప్ ఎడ్జ్ కూడా మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా వెళ్లిందంటే ఇది ఏబీ చలవేనని అర్థం చేసుకోవాలి. బౌలర్ ఎవరైనా లెక్క చేయని డివిలియర్స్‌కు 50నుంచి 100 పరుగులకు చేరేందుకు 18 బంతులు సరిపోగా, ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. బ్రేవో బౌలింగ్‌లో కవర్స్ మీదుగా కొట్టిన సిక్స్, తర్వాతి బంతికు అంగుళం కూడా కదలకుండా నేరుగా కొట్టిన సిక్సర్ అతను అందించిన వినోదాల భోజనం మెనూలో రుచికరమైనవి!  ‘మా ఆవిడ మ్యాచ్ చూసేందుకు రావటమే దీనికి కారణం’ అన్న ఏబీ... ఇంతటి విధ్వంసంలోనూ జడేజా బౌలింగ్‌లో 9 డాట్ బాల్స్ ఆడటం తనపై తనకు కోపం తెప్పించిందనడం విశేషం.

1..2..3...
గత ఏడు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు... ఐపీఎల్‌లో ఎవరూ కనీసం ఊహించలేని రీతిలో ఒకే సీజన్‌లో మూడు శతకాలతో చెలరేగడం కోహ్లికే సాధ్యమైంది. అతని ఆటను, గొప్పతనాన్ని వర్ణించేందుకు పదాలకు కొరత ఏర్పడుతోంది కానీ... అతను చేసే పరుగులకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఈ మ్యాచ్‌లోనూ ఎప్పటిలాగే కోహ్లి తనదైన శైలిలోనే నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. అర్ధ సెంచరీకి కూడా 39 బంతులు తీసుకోగా, 31 బంతుల వరకు ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. డివిలియర్స్ జోరును మరో ఎండ్‌లో ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేసిన అతను, చివర్లో చెలరేగాడు. 18 ఓవర్లు ముగిసే సరికి 65 పరుగుల వద్ద ఉన్న అతడు తనకు సెంచరీ ఆలోచనే లేదని ఏబీతో క్రీజ్‌లో చెప్పాడు. కానీ ఒక్కసారి ‘చైనామన్’ శివిల్ బౌలింగ్ రావడం అతడికి కొత్త ఉత్సాహాన్నిచ్చినట్లుంది.

ఆ ఓవర్లో మైదానంలో అన్ని వైపులకు బాదుతూ వరుసగా 6, 4, 6, 6, 6, 2 పరుగులు... అంతే నేరుగా 95కు వెళ్లిపోయాడు. మరో రెండు బంతులకే ముచ్చటగా మూడో శతకం కూడా పూర్తయింది. డివిలియర్స్‌తో పోలిస్తే మెరుపుదాడిలో కాస్త ఎక్కువ తక్కువ ఉండవచ్చేమో కానీ ఇది విరాట్ ‘విలువ’ను మరింత పెంచే ఇన్నింగ్స్ అనటంలో సందేహం లేదు.
 
 
229

టి20ల చరిత్రలోనే ఇది అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో తమ పేరిటే ఉన్న 215 పరుగుల ప్రపంచ రికార్డును డివిలియర్స్-కోహ్లి సవరించారు.
 
120
 టి20ల్లో చివరి 5 ఓవర్లలో ఒక జట్టు వందకు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.
5 ఐపీఎల్‌లో డివిలియర్స్‌ది ఐదో (43 బంతుల్లో) వేగవంతమైన సెంచరీ.
టి20ల్లో రెండు సార్లు 200కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడి డివిలియర్స్-కోహ్లి
1   ఐపీఎల్‌లో ఇదే అతి పెద్ద (144 పరుగులు) విజయం
2 ఒకే టి20 ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇది రెండోసారి.  
1   ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కోహ్లి
 
రెండు ఓవర్లు... 60 పరుగులు...
స్లాగ్ ఓవర్లలో విరాట్, ఏబీ ఊచకోతకు గుజరాత్ బౌలర్లు బ్రేవో, కౌశిక్‌లు బలయ్యారు. బ్రేవో వేసిన 18వ ఓవర్‌లో కోహ్లి తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సిక్సర్ బాదగా... నో బాల్‌గా పడిన ఐదో బంతిని బౌండరీ కొట్టిన డివిలియర్స్... తర్వాతి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. ఇక చైనామన్ బౌలర్ శివిల్ కౌశిక్‌కు 19వ ఓవర్లో కోహ్లి చుక్కలు చూపించాడు. వరుసగా  6, 4, 6, 6, 6, 2తో 30 పరుగులు రాబట్టాడు. టి 20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో 30 చొప్పున రావడం ఇదే తొలిసారి.

ప్రతీ సంవత్సరంలాగే ఈ సారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక మ్యాచ్‌ను ప్రత్యేకంగా వన సంరక్షణ ప్రచారానికి ఉపయోగించింది. ‘గో గ్రీన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం మ్యాచ్‌లో  ఆ జట్టు ఆటగాళ్లు ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరించి బరిలోకి దిగారు.

మరిన్ని వార్తలు