మానసిక స్థయిర్యమే నా బలం: కోహ్లి

11 May, 2020 02:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తను శారీరక దృఢత్వంకంటే మానసిక సంసిద్ధతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అందుకే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి అదేస్థాయిలో ఆటను మొదలుపెట్టే బలం తనలో ఉందన్నాడు. ఐపీఎల్‌ అంటే తనకు ప్రత్యేక అభిమానమని... ఒకే టోర్నీలో అన్ని దేశాల వారినీ కలుపుకొని ఆడుతూ అందరినీ అలరించే లీగ్‌ అని చెప్పాడు. అయితే కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు మునుపటిలా ఉండవని... తప్పకుండా మార్పులుంటాయని... వీటిని అంగీకరించాల్సిందేనన్నాడు. ‘ఐసీసీ టోర్నీలకంటే భిన్నమైంది ఐపీఎల్‌. అందుకే ఆ లీగ్‌ అంటే నాకెంతో ఇష్టం. మనతో కొత్తగా ఆడేవాళ్లతో మన అనుభవాలు పంచుకోవచ్చు. పాతవాళ్లతో అనుబంధం కొనసాగించవచ్చు. ఎప్పుడోగానీ చూసే విదేశీ ఆటగాళ్లతో తరచూ కలిసి ఆడే అవకాశం ఈ లీగ్‌ ద్వారానే కలుగుతుంది. అందుకే ఐపీఎల్‌ అంటే అందరికీ మోజే. అభిమానులకు క్రేజే’ అని అన్నాడు. మీ ఫేవరెట్‌ మ్యాచ్‌ ఏదనే ప్రశ్నకు బదులిస్తూ ‘ఇది చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే అలాంటివి నాకెన్నో ఉన్నాయి... అయితే అప్పటి పరిస్థితి, ప్రాధాన్యతను బట్టి చూస్తే టి20 ప్రపంచకప్‌ (2016)లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన పోరు నా ఫేవరెట్‌ మ్యాచ్‌ల్లో ఒకటి. ఓడిపోయేస్థితిలో ఉన్న ఈ మ్యాచ్‌లో మేము గెలిచాం’ అని చెప్పాడు.  

మరిన్ని వార్తలు