ఈ సంక్షోభం మనల్ని మార్చింది

22 Apr, 2020 04:46 IST|Sakshi

విరుష్క జోడీ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వ్యవస్థల్ని, వ్యక్తుల్ని ఛిద్రం చేస్తున్నది ఎంత నిజమో... మనసుల్ని మార్చింది అన్నది అంతే నిజమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ అన్నారు. ఈ మహమ్మారి... తోటివారిపట్ల ప్రజల్లో జాలీ, కరుణ గుణాల్ని పెంచిందని చెప్పారు. కోవిడ్‌–19 అంకం ముగిసినా కూడా మనమంతా ఇదే దృక్పథాన్ని కొనసాగించాలని సూచించారు. ఓ వెబ్‌సైట్‌ సంస్థకు చెందిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి, అనుష్క విజయం రుచి చూసేముందు తాము ఎదుర్కొన్న సవాళ్లను, కష్టాల గురించి మాట్లాడారు. ‘ఎన్నో కష్టాల్ని, నష్టాల్ని కలిగించిన ఈ మహమ్మారి వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. మన సమాజం మొత్తానికి దయాగుణాన్ని అలవర్చింది. పరులపట్ల జాలి కలిగేలా చేసింది. కరుణతో స్పందించేలా హృదయాల్ని మేలుకొలిపింది. ప్రాణాలు కాపాడే వైద్యులు, రక్షణ కల్పిస్తున్న పోలీసులు, మనచుట్టూ పరిసరాల్ని శుభ్రం చేస్తున్న కార్మికుల పట్ల కృతజ్ఞతాభావం పెరిగింది. ఇకముందూ ఈ స్పృహ ఇలాగే కొనసాగాలి’ అని అన్నారు.

జీవితం ఊహకందనిదని... ఏం చేస్తే సంతోషం కలుగుతుందో కచ్చితంగా అదే చేయాలని, ప్రతి దాంట్లో, ప్రతి చోటా పోల్చుకోవడం తగదని హితవు పలికారు. ‘ఈ సంక్షోభం నుంచి ఎలా భయటపడాలో ప్రజలకు బాగా తెలుసు. అలాగే ఈ సంక్షోభం తర్వాత మనజీవితం మునుపటిలా ఉండదు. ఇవన్నీ కూడా మనకు జీవిత పాఠాలే. పారిశుద్ధ్య కార్మికుల్లేకపోతే మనం ఏమవుతామో అలోచించుకోవాలి. ఏ ఒక్కరు కూడా పరులకంటే తాము ప్రత్యేకమని భావించకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనమంతా ఓ సమాజమనే భావనతో అందరూ ఇప్పుడు వేస్తున్న అడుగులు మన ఔన్నత్యానికి నిదర్శనం’ అని కోహ్లి, అనుష్క అన్నారు. జీవితంలో నిస్సహాయంగా అనిపించిన క్షణమేదని కోహ్లిని అడగ్గా... జూనియర్‌ స్థాయిలో ఢిల్లీ రాష్ట్ర జట్టులోకి ఎంపికకాని సమయంలో చాలా బాధ పడ్డానని గుర్తు చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు