గుండె పగిలిపోతోంది.. విరుష్కల విరాళం

30 Mar, 2020 13:11 IST|Sakshi

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- అనుష్క దంపతులు ముందుకు వచ్చారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా ప్రధాన మంత్రి‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తామని ప్రకటించారు. అయితే ఎంత మొత్తం విరాళంగా ఇస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ఈ మేరకు... ‘‘వారి బాధను చూస్తుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి. మేము చేసే సాయం తోటి పౌరులకు బాధ నుంచి విముక్తి కల్పిస్తుందని ఆశిస్తున్నాం. పీఎం కేర్స్‌ ఫండ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించాలని నేను అనుష్క నిర్ణయించుకున్నాం’’ అని కోహ్లి ట్వీట్‌ చేశాడు. (అక్షయ్‌ విరాళం : గర్వపడేలా చేశాడు)

కాగా కరోనాపై పోరుకు సన్నద్ధమయ్యే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు సెలబ్రిటీలు సహా సామాన్యులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రీడాకారులు సైతం తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ రూ. 50 లక్షలు, సురేశ్‌ రైనా రూ. 52 లక్షలు, స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ తన నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఇక భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 51 కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.(జొకోవిచ్‌ భారీ విరాళం)

మరిన్ని వార్తలు