మావాళ్ల తరఫున సారీ స్మిత్‌ : కోహ్లి

10 Jun, 2019 08:50 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, స్మిత్‌

వీలైతే అభినందించండి డ్యూడ్‌

భారత అభిమానులను మందలించిన కోహ్లి

లండన్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత అభిమానుల తరఫున ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు క్షమాపణలు చెప్పాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత్‌ అభిమానులు స్మిత్‌ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్‌, చీటర్‌’ అంటూ గేలి చేశారు.  కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్‌ పాండ్యా వికెట్‌ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్‌ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. 

మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. భారత ప్రేక్షకుల తరఫున తానే స్వయంగా స్టీవ్‌ స్మిత్‌కు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు.  ‘జరిగిందేదో జరిగిపోయింది. అతను పునరాగమనం చేశాడు. వారి దేశం కోసం పోరాడుతున్నాడు. ఐపీఎల్‌లో సైతం స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా. ఒకరిని కించపరస్తూ ఇలా గేలిచేయడం అంత మంచింది కాదు. మా అభిమానుల తరఫున మైదానంలోనే అతన్ని క్షమాపణలు కోరాను. ఇది ఏమాత్రం అంగీకరించేది కాదు. గతంలో మా మధ్య వివాదాలు ఉండవచ్చు. మైదానంలో ఇద్దరం వాదించుకోవచ్చు. కానీ అతని బాధ నుంచి వచ్చే ఆటను చూడాలనుకోవద్దు. ఇక్కడ చాలా మంది భారత అభిమానులు ఉన్నారు. వారంతా ఓ చెత్త ఉదాహరణగా మిగిలిపోవద్దు. నేను స్మిత్‌ స్థానంలో ఉంటేనైతే చాలా బాధపడేవాడిని ఎందుకంటే.. అతను తప్పు చేశాడు. ఆ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. దానికి శిక్షను కూడా అనుభవించాడు. అయినా మళ్లీ గేలి చేస్తే సహించడం ఎవరికైనా కష్టమే’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అభిమానులను కోహ్లి మందలించడాన్ని చూసిన స్మిత్‌.. అభినందన పూర్వకంగా అతనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.

గెలుపుపై స్పందిస్తూ.. ‘ఇది సమిష్టి విజయం. స్వదేశంలో ఆసీస్‌తో సిరీస్‌ ఓడిపోయాం. దీంతో మేమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని భావించాం. ఆ పట్టుదలతోనే ఆడి మ్యాచ్‌ గెలిచాం.’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... విరాట్‌ కోహ్లి (77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక కోహ్లి క్రీడాస్పూర్తిని భారత నెటిజన్లు కొనియాడుతున్నారు. శభాష్‌ కోహ్లి అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు