విరాట్ కోహ్లి అరుదైన ఘనత

10 Feb, 2018 20:12 IST|Sakshi
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి

జొహన్నెస్‌బర్గ్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో ఐదో స్థానం (టాప్ 5 క్లబ్‌)లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లి (75: 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (9378) పరుగులను కోహ్లి అధిగమించాడు. 

ఈ వన్డేకు ముందు 9348 పరుగులతో ఉన్న కోహ్లి వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన భారత క్రికెటర్లలో అజహరుద్దీన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. నాలుగో వన్డేలో వ్యక్తిగత స్కోరు 31 పరుగుల వద్ద అజహర్ వన్డే పరుగులను కోహ్లి అధిగమించాడు. దీంతో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత టాప్ 5 క్రికెటర్ల క్లబ్‌లో కోహ్లి చేరిపోయాడు. అజహర్ 334 వన్డేల్లో 308 ఇన్నింగ్స్‌లు ఆడి 7 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీల సాయంతో 9378 పరుగులు చేశాడు. 206 వన్డేలాడిన కోహ్లి కేవలం 198వ ఇన్నింగ్స్‌లోనే అజహరుద్దీన్ పరుగులను దాటిపోయాడు. కోహ్లి 34 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 9423 పరుగులు చేశాడు. రెండు, మూడు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి నాలుగో వన్డేలో 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 

అగ్రస్థానంలో సచిన్
టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్ 18,426 అత్యధిక వన్డే పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కాగా భారత్‌ నుంచి సౌరవ్ గంగూలీ (11,221), రాహుల్ ద్రవిడ్ (10,768), ఎంఎస్ ధోని (9738) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనికి పదివేల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. నాలుగో వన్డే ఇన్నింగ్స్ తర్వాత కోహ్లి 9,423 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు