విరాట్ కోహ్లి అరుదైన ఘనత

18 Apr, 2018 15:54 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

రైనాను వెనక్కి నెట్టేసిన కోహ్లి!

సాక్షి, ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో అరుదైన ఘనతను సాధించాడు. ఈ ట్వంటీ20 టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి (4,619 పరుగులు) నిలిచాడు. ఐపీఎల్-11లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫిట్ అందుకున్నాడు. సురేశ్ రైనా (4,558 పరుగులు)ను రెండో స్థానానికి నెట్టేశాడు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన కోహ్లి, ముంబైతో మ్యాచ్‌కు ముందు రైనా కంటే 31 పరుగుల వెనుకంజలో ఉన్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (94 పరుగులు) రాణించడంతో నిర్ణీత ఓవరల్లో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరుకు డికాక్, కోహ్లి 4 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. కానీ, డికాక్, డివిలియర్స్‌ (1)లను మూడు బంతుల వ్యవధిలో అవుట్‌ చేసి మెక్లీనగన్‌ దెబ్బ కొట్టాడు. ఆపై బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా.. కెప్టెన్ కోహ్లి (62 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రం ఒంటరి పోరాటం చేసినా జట్టును గట్టెక్కించలేకపోయాడు. 46 పరుగుల తేడాతో ముంబై చేతిలో బెంగళూరు ఓటమిపాలైన విషయం తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు 4,527 పరుగులతో ఉన్న కోహ్లి.. ముంబైతో మ్యాచ్‌లో 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనాను అదిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు గాయం కారణంగా రైనా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్లో 4 మ్యాచ్‌లాడిన కోహ్లి అత్యధిక పరుగుల (201)తో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.

ఐపీఎల్ టాప్ స్కోరర్లు
విరాట్‌ కోహ్లి       - 4,619 పరుగులు
సురేశ్ రైనా        - 4,558 పరుగులు
రోహిత్‌ శర్మ       - 4,345 పరుగులు
గౌతం గంభీర్      - 4,210 పరుగులు  

మరిన్ని వార్తలు