‘కోహ్లి కంటే వారిద్దరే సమర్ధులు’

11 Feb, 2019 10:59 IST|Sakshi

ముంబై: కొన్ని అంశాలను లోతుగా అంచనా వేసి చూస్తే ప్రస్తుత ప్రపంచ అత్యత్తుమ క్రికెట్‌ కెప్టెన్ల జాబితాలో విరాట్‌ కోహ్లికి స్థానం ఉండదని అంటున్నాడు ఆసీస్‌ దిగ్జజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌. కేవలం కోహ్లి నాయకుడు మాత్రమేనని పేర్కొన్న వార్న్‌.. సమర్థుడైన సారథి ఎంతమాత్రం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌కు కోహ్లినే తగిన సారథిగా వార్న్‌ పేర్కొన్నాడు. అదే సమయంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ఆసీస్‌ తాత్కాలిక టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌లను సమర్థులైన కెప్టెన్లని వార్న్‌ అన్నాడు. (రాజస్తాన్‌ రాయల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షేన్‌ వార్న్‌)

ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయకత్వం, సమర్దవంతమైన సారథ్యం, లీడర్‌ ఆప్‌ ద టీమ్‌ తదితర అంశాల గురించి మాట్లాడిన వార్న్‌.. ఈ మూడింటిని వేర్వేరుగా చూడాలన్నాడు.  ప్రస్తుతం ఒక జట్టుకు కోహ్లి ఒక బెస్ట్‌ లీడర్‌గా మాత్రమే ఉన్నాడని విశ్లేషించాడు. తాను కోహ్లికి పెద్ద అభిమానిగా పేర్కొన్న వార్న్‌.. గేమ్‌ పరంగా చూస్తే కోహ్లిని అసాధారణ ఆటగాడిగా తెలిపాడు. ‘ భారత జట్టును కోహ్లి ముందుండి నడిపిస్తున్న తీరు బాగుంది. కానీ సమర్ధవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు. ఒక జట్టుకు సరైన వ్యూహ రచన చేస్తూ నడిపిస్తున్న ప్రస్తుత కెప్టెన్ల జాబితాలో విలియమ్సన్‌, టిమ్‌ పైన్‌లే కోహ్లి కంటే మెరుగ్గా ఉన్నారు. కోహ్లి కంటే వారిద్దరే సమర్దవంతమైన కెప్టెన్లు అనేది నా అభిప్రాయం’ అని వార్న్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు