ఛేజింగ్‌ల్లో సచిన్‌ కన్నా కోహ్లినే మిన్న

17 May, 2020 00:05 IST|Sakshi

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ పీటర్సన్‌

లండన్‌: లక్ష్య ఛేదనల విషయానికొస్తే భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా కోహ్లి తర్వాతేనని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి అసాధారణ రికార్డులతో పోలిస్తే ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ప్రదర్శనలన్నీ తేలిపోతాయని పీటర్సన్‌ అన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్‌ పోమీ ఎంబాగ్వాతో శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన పీటర్సన్‌ ‘అత్యంత ఒత్తిడి అనుభవిస్తూ ఛేదనలో భారత్‌ను తరచుగా గెలిపించే కోహ్లి రికార్డు ముందు స్మిత్‌ దిగదుడుపే. స్మిత్‌ అతని దరిదాపుల్లోకి కూడా రాలేడు. మ్యాచ్‌ ఛేదనలో కోహ్లి సగటు 80. అతని వన్డే సెంచరీలన్నీ ఛేజింగ్‌లో వచ్చినవే.

దీన్ని బట్టి చూస్తే నా దృష్టిలో సచిన్‌ కన్నా కూడా విరాటే ఉత్తమం. వ్యక్తిగత ప్రదర్శనల కన్నా దేశాన్ని గెలిపించడమే ముఖ్యం. నన్ను కూడా ఈ భావమే నడిపించేది. ఎన్ని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు అందుకున్నామన్నది కాదు ఇంగ్లండ్‌ను ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిపించామన్నదే నాకు ముఖ్యం. భారత్‌ కోసం కోహ్లి కూడా ఇదే చేస్తున్నాడు. అతనో అసాధారణ క్రికెటర్‌’ అని పీటర్సన్‌ కొనియాడాడు. క్రికెట్‌ మూడు ఫార్మాట్‌లలో విరాట్‌ 50కి పైగా సగటును కలిగి ఉండగా... స్టీవ్‌ స్మిత్‌ టెస్టుల్లో 62.74, వన్డేల్లో 42.46, టి20ల్లో 29.60 సగటుతో ఉన్నాడు.

మరిన్ని వార్తలు