కెప్టెన్‌గా కోహ్లి సరికొత్త రికార్డు

3 Sep, 2019 08:55 IST|Sakshi

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా పలు కొత్త రికార్డులు సృష్టించింది. 257 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించిన కోహ్లి సేన 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత సాధించింది. అదే విధంగా ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ విజయం ద్వారా వ్యక్తిగతంగానూ కోహ్లి ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా 48 టెస్టులకు సారథ్యం వహించిన ఈ రన్‌ మెషీన్‌ 28 విజయాలతో ధోని రికార్డును అధిగమించాడు. తద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ల అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు మిస్టర్‌ కూల్‌ ధోని పేరిట ఉండేది. కెప్టెన్‌గా 27 మ్యాచ్‌లు గెలిచిన ధోని..(ఓటమి-18, డ్రా-15) విజయాల శాతం 45గా ఉండగా.. కోహ్లి 55.31 శాతం విజయాలతో(10 ఓటమి, డ్రా-10) అతడి రికార్డు బ్రేక్‌ చేశాడు. కాగా ప్రస్తుతం ఓవరాల్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్‌ వా(36), రికీ పాంటింగ్‌(33) తర్వాత కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

చదవండి : టీమిండియా భారీ గెలుపు


ఇక 2014లో ధోని నుంచి టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లి టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లపై స్వదేశంలో గెలుపొందడంతో పాటుగా...ఆస్ట్రేలియాలో 2019లో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి 71 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగా ఉన్న కలను సాకారం చేశాడు. అంతేకాకుండా విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించాడు.

కాగా జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో 468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 59.5 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. ఇక ఈ టెస్టులో సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన యువ క్రికెటర్‌ హనుమ విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా నిలిచాడు. మొదటి టెస్ట్‌లో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు