ఏదైనా సాధించగలమనే నమ్మకం పెంచింది

1 Jul, 2020 00:14 IST|Sakshi

2014 అడిలైడ్‌ టెస్టుపై కోహ్లి వ్యాఖ్య 

న్యూఢిల్లీ: భారత జట్టు 2018–19 సీజన్‌లో తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అయితే అంతకు నాలుగేళ్ల క్రితమే ఒక టెస్టులో అద్భుత విజయానికి చేరువగా వచ్చి త్రుటిలో ఓటమి పాలైంది. నాటి మ్యాచ్‌లో తమ ఆటతీరు జట్టులో ఆత్మవిశ్వాసం నింపిందని, గట్టిగా ప్రయత్నిస్తే ఆస్ట్రేలియాలో విజయం సాధించగలమనే నమ్మకాన్ని పెంచిందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. 2014–15 సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టును గుర్తు చేసుకుంటూ అతను ఈ వ్యాఖ్య చేశాడు. ధోని గైర్హాజరులో ఈ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 315 పరుగులకు ఆలౌటై 48 పరుగుల తేడాతో ఓడింది. 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 141 పరుగులు చేసిన కోహ్లి గెలుపు కోసం మరో 60 పరుగులు చేయాల్సిన దశలో నిష్క్రమించాడు. ఆ తర్వాత జట్టు కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌ను కోహ్లి సోషల్‌ మీడియాలో గుర్తు చేసుకున్నాడు. ‘ఈ రోజు మన టెస్టు జట్టు ఇంత మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ఎంతో ప్రత్యేకమైన, కీలకమైన అడిలైడ్‌æ 2014 టెస్టు మ్యాచ్‌ జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇరు జట్లూ ఎంతో భావోద్వేగంతో ఆ మ్యాచ్‌ ఆడాయి (మైదానంలో బంతి తగిలి ఆసీస్‌ ఆటగాడు ఫిల్‌ హ్యూజెస్‌ అనూహ్యంగా మృతి చెందిన కొద్ది రోజులకు ఈ టెస్టు జరిగింది). ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి దక్కింది. మేం గెలుపు తీరం చేరలేకపోయినా చేరువగా మాత్రం రాగలిగాం. మేం పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెడితే ఏదైనా సాధ్యమే అని ఆ మ్యాచ్‌ నిరూపించింది. ఎవరూ అంతకుముందు ఊహించని విధంగా దాదాపు గెలిచినంత పని చేశాం. మేమెంతో అంకితభావంతో ఆడాం. టెస్టు జట్టుగా ఎదిగే క్రమంలో ఈ మ్యాచ్‌ ఎప్పటికీ ఒక మైలురాయిగా మిగిలిపోతుంది’ అని కోహ్లి ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు