ఆడొచ్చు కానీ... మజా ఉండదు

9 May, 2020 02:25 IST|Sakshi

ప్రేక్షకుల్లేని క్రికెట్‌పై కోహ్లి వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. అయితే ఈల, గోలలేని మ్యాచ్‌లో మజా, మ్యాజిక్‌ ఉండవని అన్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. అయితే వైరస్‌ అదుపులోకి వచ్చాక గప్‌చుప్‌గా టోర్నీలు నిర్వహించే ప్రత్యామ్నాయంపైనే ఇప్పుడు అన్ని దేశాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కోహ్లి మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు మూసి మ్యాచ్‌లు ఆడించవచ్చు. అయితే దీన్ని క్రికెటర్లు ఎలా స్వీకరిస్తారో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మేమంతా ప్రేక్షకుల ముందే ఆడాం. వాళ్లంతా ఆటను ఆరాధించేవారు. క్రేజీగా ఎగబడేవారు. దీంతో మ్యాచ్‌ జరుగుతుంటే ఎన్నో అనుభూతులు కలిగేవి. ఎక్కడలేని భావోద్వేగాలన్నీ బయటపడేవి. ఇప్పుడు ఇవన్నీ ఉండవు. కాబట్టి మ్యాచ్‌లో ఆ తీవ్రత లోపిస్తుంది’ అని అన్నాడు. గప్‌చుప్‌గా నిర్వహించే ప్రత్యామ్నాయంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్, జేసన్‌ రాయ్, బట్లర్, కమిన్స్‌ ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరగాలని కోరుతుండగా... ఆస్ట్రేలియా విఖ్యాత ఆటగాడు అలెన్‌ బోర్డర్‌ ప్రేక్షకుల్లేని టి20 ప్రపంచకప్‌ను వ్యతిరేకించారు. మ్యాక్స్‌వెల్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  

మరిన్ని వార్తలు