తను అద్భుతం చేశాడు: కోహ్లి

5 Aug, 2019 09:03 IST|Sakshi

లాడర్‌హిల్‌ : జట్టు సమిష్టి కృషి వల్లే వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. సిరీస్‌ గెలవడం ద్వారా తదుపరి మ్యాచ్‌లో కొత్త ఆటగాళ్లకు అవకాశం దొరుకుతుందని పేర్కొన్నాడు. ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌పై.. భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో కోహ్లి సేనను విజయం వరించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ 2-0 తేడాతో టీమిండియా సొంతమైంది. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ... ‘జట్టు సభ్యులంతా ఆటలో ఎంతో పరిణతి కనబరిచారు. బ్యాట్స్‌మెన్‌ దూకుడు చూస్తే 180 పరుగులు సాధిస్తాం అనిపించింది. అయితే పిచ్‌ స్లోగా ఉన్న కారణంగా అనుకున్న మేర స్కోరు చేయలేకపోయాం. ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా సిరీస్‌ మా సొంతమైంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. అయితే మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే’ అని చెప్పుకొచ్చాడు.

ఇక విండీస్‌ రెండో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ను పెవిలియన్‌కు చేర్చిన యువ బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ని కోహ్లి ప్రశంసించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు తను చుక్కలు చూపించాడని.. కొత్త బంతితో అద్భుతం చేశాడని కొనియాడాడు. బంతి బంతికి ఉత్సుకతను రేకెత్తించే టీ20 మ్యాచ్‌కు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుందని..గయనాలో ఆడేందుకు జట్టు సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు. కాగా ఆదివారం నాటి టీ20లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు‌. కెప్టెన్‌ కోహ్లి (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.

మరోవైపు విండీస్‌ బౌలర్లలో థామస్‌ (2/27), కాట్రెల్‌ (2/25) రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో రావ్‌మన్‌ పావెల్‌ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మినహా విండీస్‌ తరఫున పెద్దగా ప్రతిఘటన లేకపోయింది. ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1/12), పేసర్‌ భువనేశ్వర్‌ (1/7) ప్రత్యర్థిని మొదట్లోనే దెబ్బకొట్టారు. విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్‌ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి వర్తింపజేయగా... విండీస్‌ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉన్నట్లు తేలడంతో టీమిండియా విజయం ఖరారైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా