‘జోకర్‌’ అనిపించుకోవడమే నాకిష్టం!

23 Jan, 2017 23:43 IST|Sakshi
‘జోకర్‌’ అనిపించుకోవడమే నాకిష్టం!

విరాట్‌ కోహ్లి వ్యాఖ్య 
టి20లకు సిద్ధమన్న భారత కెప్టెన్‌  


కోల్‌కతా: విరాట్‌ కోహ్లి అద్భుత ఆటతీరుపై ఇటీవల కురుస్తున్న ప్రశంసల వర్షానికి విరామమే లేదు. అతడిని పిలిచేందుకు కొత్త విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ‘కింగ్‌ కోహ్లి’ అని, ‘భయమన్నదే ఎరుగని నాయకుడు’ అంటూ ఇలా అతడిని ప్రస్తుతిస్తున్నారు. కానీ అసలు ఇలాంటి వాటి గురించి తాను ఏమనుకుంటున్నాడని అతడినే ప్రశ్నిస్తే... ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో నేను జోకర్‌ అని పిలిపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను’ అని ఒక్క ముక్కలో తన గురించి తాను చెప్పుకున్నాడు! మరోవైపు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని అతను విశ్లేషించాడు. తొలి, చివరి వన్డేల్లో జాదవ్‌ బ్యాటింగ్, ఆఖరి మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాటు, సీనియర్లు యువరాజ్, ధోని కటక్‌ మ్యాచ్‌లో చెలరేగడం ఈ సిరీస్‌లో ప్రత్యేక క్షణాలని అతను ప్రశంసించాడు. ఓపెనింగ్‌ సమస్యను కూడా త్వరలోనే చక్కదిద్దుకుంటామని అతను అన్నారు. ‘మన ఓపెనర్లకు మద్దతుగా నిలబడాల్సిన సమయమిది. వారు ఫామ్‌లోకి తిరిగి వచ్చేందుకు తగిన అవకాశమిచ్చి ప్రోత్సహించాలి. మన దగ్గర కావాల్సినంత మంది మంచి ఓపెనర్లు ఉన్నారు. అయితే ఈ లోపాన్ని సవరించుకునేందుకు ప్రయత్నిస్తాం.

సరిగ్గా చెప్పాలంటే మా బ్యాటింగ్‌ బలం తమ పూర్తి సామర్థ్యంలో 75 శాతం మాత్రమే ఆటను ప్రదర్శించింది. ఓపెనింగ్‌ కూడా చక్కబడి వంద శాతం బాగా ఆడితే ఇంకా ఎన్ని పరుగులు చేసేవాళ్లమో దేవుడికే తెలుసు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి (జూన్‌లో) ముందు ఇకపై షెడ్యూల్‌ ప్రకారం మన జట్టుకు వన్డేలు లేవు. అయితే ఇది పెద్ద సమస్య కాదని, టి20 మ్యాచ్‌ల వల్ల డెత్‌ బౌలింగ్‌ మెరుగు పడుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘వన్డేలు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటింగ్‌కు సంబంధించి ఫార్మాట్‌ ఏదైనా టెక్నిక్‌లో తేడా ఉండదు. టి20ల వల్ల బౌలింగ్‌ మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ డెత్‌ బౌలింగ్‌లో చక్కగా బంతులు వేస్తే వన్డేలకు అది మంచి పాఠంలా మారుతుంది’ అని విరాట్‌ విశ్లేషించాడు.

ధోని సంతకం చేసిన బంతిని ఇచ్చాడు...
కటక్‌లో రెండో వన్డే గెలుపు తర్వాత సిరీస్‌ భారత్‌ సొంతమైంది. ఈ క్షణాన్ని చిరస్మరణీయం చేసేందుకు మాజీ కెప్టెన్‌ ధోని మ్యాచ్‌ బాల్‌ తనకు ఇచ్చాడని కోహ్లి వెల్లడిం చాడు. ‘ఈ రోజుల్లో స్టంప్స్‌ చాలా విలువైనవి కాబట్టి వాటిని ఎవరూ తీసుకుపోనివ్వడం లేదు. ధోని అందుకే మ్యాచ్‌ బాల్‌ను నాకిచ్చి ఇది నా తొలి సిరీస్‌ విజయం కాబట్టి జ్ఞాపికగా ఉంచుకోమన్నాడు. అతను దానిపై తన సంతకం కూడా చేసి ఇవ్వడం నాకో మధుర క్షణం’ అని కోహ్లి అన్నాడు.

మరిన్ని వార్తలు