కోహ్లిపై సెటైర్లతో నెటిజన్ల ఫైర్‌

6 Jan, 2018 11:35 IST|Sakshi

కేప్‌టౌన్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. దక్షిణాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లి(5) దారుణంగా విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆగ్రహాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లగక్కారు. కొందరైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫొటో మార్ఫింగ్‌లతో ట్రోల్‌ చేస్తున్నారు. తుది జట్టులో రహానేను తీసుకోకపోవడంపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ఓవర్‌సీస్‌లో రాణించే రహానేను ఎందుకు పక్కన పెట్టారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికా 286 ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్.. ఓపెనర్లు మురళి విజయ్‌(1), శిఖర్‌ ధావన్‌(16)ల వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. బాధ్యతాయుతంగా ఆడాల్సిన కోహ్లి(5) సైతం నిరాశపరచడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో తమ ఆవేశాన్ని సోషల్‌మీడియాలో వెల్లగక్కారు. ఇప్పుడు ఈ పోస్టులు తెగవైరల్‌ అవుతున్నాయి.

 కోహ్లిపై అభిమానుల సెటైరిక్‌ ట్వీట్స్‌.. 
అంచనాలు : కోహ్లి ఏ పరిస్థితుల్లోనైనా ఆడగలడు.
నిజం: బ్యాటింగ్‌ పిచ్‌లో 200 పైగా పరుగులు చేయగలడు. కానీ బౌలింగ్‌ పిచ్‌లో 20 పరుగులు చేయలేడు.

కోచ్‌: కోహ్లి దక్షిణాఫ్రికాలో ఎందుకు ఇబ్బందిపడుతున్నావు..?
కోహ్లి: జాతిపిత మహాత్మగాంధే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కున్నారు నేనేంత

‘హనీమూన్‌ డేస్‌ ఉద్యోగానికి రమ్మంటే ఇలానే ఉంటుంది.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాను.. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లైంది’.

‘కోహ్లి కన్నా స్మిత్‌ బెస్ట్‌. అన్నిపరిస్థితుల్లో స్మిత్‌ ఆడగలడు. కోహ్లి కేవలం ఉపఖండ పిచ్‌లపైనే రాణించగలడు’.

‘హనీమూన్‌ హ్యాంగోవర్‌ నుంచి బయటపడి తన సహజమైన ఆట ఆడటానికి కోహ్లి ఇంకా 10 నుంచి 15 ఇన్నింగ్స్‌లు తీసుకుంటాడు’. 

‘మోదీగారు.. ఓవర్‌సీస్‌లో ఎలా రాణించాలో కోహ్లికి సలహాలివ్వండి’.

ఈపర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాపై ఒత్తిడి నెలకొనగా తొలి మ్యాచ్‌లో ఓడితే మరింత ఒత్తిడి పెరగనుంది. దక్షిణాఫ్రికాలో ఆరుసార్లు పర్యటించిన భారత్‌ ఒక్కటంటే ఒక్క టెస్ట్‌ సిరీస్‌ గెలవలేదు. సఫారీలతో భారత్‌ కేవలం రెండు టెస్టులు మాత్రమే నెగ్గగా 8 ఓడి, 7 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇక క్రీజులో రోహిత్‌, పుజారాలున్నారు. ఈ రోజు బ్యాటింగ్‌తో భారత విజయవకాశం తేలనుంది.

మరిన్ని వార్తలు