ఆ జాబితాలో కోహ్లికి ఆరో స్థానం

6 Jun, 2020 02:51 IST|Sakshi

లాక్‌డౌన్‌లో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారుల్లో ఆరో స్థానం

రూ. 3 కోట్ల 64 లక్షలు సంపాదించిన భారత కెప్టెన్‌

రూ. 17 కోట్లతో అగ్రస్థానంలో క్రిస్టియానో రొనాల్డో

లండన్‌: కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్‌ జరగకపోయినా... పలువురు స్టార్‌ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ స్టార్‌ క్రీడాకారులు ఎంత మొత్తం సంపాదించారనే లెక్కలను ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచి టాప్‌–10లో స్థానం పొందిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. గత రెండు నెలల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వాణిజ్య ప్రకటనల ద్వారా కోహ్లి మొత్తం 3,79,294 పౌండ్లు (రూ. 3 కోట్ల 64 లక్షలు) ఆర్జించాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

రొనాల్డో మొత్తం 18 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 27 లక్షలు) సంపాదించాడు. 12 లక్షల పౌండ్లతో (రూ. 11 కోట్ల 52 లక్షలు) అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ రెండో స్థానంలో... 11 లక్షల పౌండ్లతో (రూ. 10 కోట్ల 56 లక్షలు) బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు నెమార్‌ మూడో స్థానంలో నిలిచారు. 5,83,628 పౌండ్లతో (రూ. 5 కోట్ల 60 లక్షలు) అమెరికా బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ షకీల్‌ ఓనీల్‌ నాలుగో స్థానంలో... 4,05,359 పౌండ్లతో (రూ. 3 కోట్ల 89 లక్షలు) ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ ఐదో స్థానంలో నిలిచారు. జ్లాటన్‌ ఇబ్రహీమోవిచ్‌ (స్వీడన్‌ ఫుట్‌బాలర్‌; రూ. కోటీ 77 లక్షలు), డ్వేన్‌ వేడ్‌ (మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌; రూ. కోటీ 37 లక్షలు), డానీ అల్వెస్‌ (బ్రెజిల్‌ ఫుట్‌బాలర్‌; రూ. కోటీ 28 లక్షలు), ఆంథోనీ జోషువా (బ్రిటన్‌ బాక్సర్‌; రూ. కోటీ 16 లక్షలు) వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది ర్యాంక్‌ల్లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా