కోహ్లి హిట్టింగ్‌; భారత్‌ భారీ స్కోరు

27 Feb, 2019 20:45 IST|Sakshi

బెంగళూరు: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చితక్కొట్టుడికి ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, ఎంఎస్‌ ధోని మెరుపులు జతకావడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియాకు 191 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 4 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ శుభారంభం అందించారు. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద రాహుల్‌ అవుటయ్యాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ధావన్‌(14), రిషబ్‌ పంత్‌(1) వెంట వెంటనే అవుట్‌కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ కుదుపునకు లోనైంది.

అయితే కోహ్లి, ధోని చెలరేగడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది. కోహ్లి 29 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో 20వ అర్ధ శతకం సాధించాడు. విశాఖ​ మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్న ధోని ఈరోజు హిట్టింగ్‌ ఆడాడు. చివరి ఓవర్‌లో అతడు అవుటయ్యాడు. ధోని 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లి 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు