విరాట్ కోహ్లి వల్లే..

15 Sep, 2016 11:22 IST|Sakshi
విరాట్ కోహ్లి వల్లే..

ముంబై:ఇటీవల కాలంలో భారత క్రికెట్లో  ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గత జూన్లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రంలోనే సెంచరీ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రాహుల్.. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో భారీ సెంచరీ సాధించాడు. తద్వారా వరుస మూడు హాఫ్ సెంచరీలను శతకాలుగా మార్చిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఆపై యూఎస్ లో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ 20లో తొలి సెంచరీ సాధించి మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. 46 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో  తొలి  టి20 శతకం పూర్తిచేసిన రాహుల్.. ఈ ఫార్మాట్లో అత్యంత వేగవంతంగా సెంచరీ కొట్టిన ఆటగాడిగా డుప్లెసిస్(దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే తన బ్యాటింగ్  రాటుదేలడానికి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లినే కారణమంటున్నాడు భారత క్రికెట్ సంచలనం కేఎల్ రాహుల్.

'కోహ్లినే నాలో స్ఫూర్తి నింపాడు.  ప్రత్యేకంగా నాలో నమ్మకం పెరగడానికి కోహ్లినే ప్రధాన కారణం. డ్రెస్సింగ్ రూమ్లో మా ప్రక్కనే కూర్చుని మమ్మల్ని సరైన దిశలో నడిపించే నాయకుడు కోహ్లి.  ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ ముందుండి నడిపించే కెప్టెన్. కోహ్లిలో ఉన్న కమిట్మెంటే కారణంగానే నా బ్యాటింగ్ మరింతగా బలపడింది. అటు క్రమశిక్షణ, ఇటు డైట్ విషయాల్లో కూడా క్రమశిక్షణ విషయాల్లో కూడా కోహ్లి నియమబద్ధంగా ఉంటాడు'అని రాహుల్ స్పష్టం చేశాడు.

>
మరిన్ని వార్తలు