ఇది స్లో వికెట్‌.. మరి కోహ్లి అలా ఆడితే ఎలా?

23 Feb, 2020 15:53 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు కోల్పోవడానికి టాపార్డరే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ విమర్శించాడు. పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆడటంతోనే మ్యాచ్‌పై పట్టుకోల్పోయామన్నాడు. ప్రధానంగా టీమిండియా కీలక ఆటగాడైన విరాట్‌ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆడిన తీరును సుతిమెత్తగా లక్ష్మణ్‌ వేలెత్తిచూపాడు. అసలు రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి ఎందుకు విఫలమయ్యాడో విశ్లేషించాడు. ‘ ఇది చాలా స్లో వికెట్‌. అనుకున్నంతగా బంతి స్వింగ్‌ కావడం లేదు. దాంతో కాస్త భిన్నంగా ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌ పేసర్లకు స్వింగ్‌ దొరకపోవడంతో ఎక్కువగా షార్ట్‌ పిచ్‌ బంతులనే సంధించారు. బాడీ లైన్‌ బంతులతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో కాస్త సంయమనంతో ఆడాలి. ఇక్కడ ఓపిక అవసరం. క్రీజ్‌లో పాతుకుపోవడానికే యత్నించాలి. స్టైక్‌ రొటేట్‌ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. కోహ్లి ఔటైన తీరు నిరాశను మిగిల్చింది. ఊరించే షార్ట్‌ పిచ్‌ బంతికి కోహ్లి దొరికేశాడు. (ఇక్కడ చదవండి: భారమంతా హనుమ, అజింక్యాలపైనే!)

ఇక్కడ కోహ్లిలో ఓపిక లోపించినట్లే కనబడింది. అనవసరపు షాట్‌కు పోయి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఒక స్ట్రోక్‌ ప్లేయర్‌ అత్యల్ప స్కోర్లు చేస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తుంది. అటువంటప్పుడు ఎక్కువ పరుగులు చేయాలని ఆత్రం ఉంటుంది. ఎటాక్‌ చేయడానికి సిద్ధ పడతాం. ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడటానికే యత్నిస్తాం. ఆ ప్రయత్నంలోనే కోహ్లి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఉపఖండం పిచ్‌ల్లో విరాట్‌ ఈ తరహాలో ఔట్‌ కావడం చాలా అరుదు. న్యూజిలాండ్‌ పిచ్‌లు కాస్త భిన్నమైనవి. బంతుల్ని ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఓపికతో ఆడి సక్సెస్‌ అయ్యాడు’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకు ఔటైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.(ఇక్కడ చదవండి: అదే అతి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌: సౌతీ)

మరిన్ని వార్తలు